ప్ర‌త్యేక గ్రీవెన్స్‌తో స‌మ‌స్య‌ల‌కు స‌త్వ‌ర ప‌రిష్కారం

  • విజ‌య‌వంతంగా నియోజ‌క‌వ‌ర్గ‌స్థాయి పీజీఆర్ఎస్‌
  • అర్జీల ప‌రిష్కారంపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌
  • జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.లక్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు శ్రీరాం రాజ‌గోపాల్ (తాత‌య్య‌)

పెనుగంచిప్రోలు, ఆంధ్రప్రభ: ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా వారి సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి సత్వర పరిష్కారం చూపించేందుకు నియోజకవర్గ స్థాయి ప్ర‌త్యేక ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక (పీజీఆర్ఎస్‌) దోహ‌దం చేస్తోంద‌ని.. ఈ ప్ర‌త్యేక గ్రీవెన్స్ కార్య‌క్ర‌మాలు విజ‌య‌వంతంగా ముందుకెళ్తున్నాయ‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, శాస‌న‌స‌భ్యులు శ్రీరాం రాజ‌గోపాల్ (తాత‌య్య‌) అన్నారు. ఒక నెల – ఒక నియోజ‌క‌వ‌ర్గం – నాలుగు సందర్శనలు కార్యక్రమంలో భాగంగా శుక్ర‌వారం జగ్గయ్యపేట నియోజకవర్గంలో వత్సవాయి శ్రీ వాసవీ కళ్యాణ మండపంలో ప్ర‌త్యేక గ్రీవెన్స్ జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌, స్థానిక శాస‌న‌స‌భ్యులు శ్రీరాం రాజ‌గోపాల్ (తాత‌య్య‌) పాల్గొన్నారు. స్థానిక ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించి.. వాటి ప‌రిష్కారానికి తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై సంబంధిత అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ప్ర‌తిసోమ‌వారం క‌లెక్ట‌రేట్‌లో పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని.. అయితే అక్క‌డికి వివిధ కార‌ణాల వ‌ల్ల రాలేనివారికి ప్ర‌త్యేక గ్రీవెన్స్ ద్వారా మేలు జ‌రుగుతోంద‌న్నారు.

22ఏ నుంచి తొల‌గింపు వంటి వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌ల‌తో పాటు మంచి నీటి స‌ర‌ఫ‌రా, శ్మ‌శాన వాటిక వంటి స‌మాజ శ్రేయ‌స్సుతో ముడిప‌డిన అంశాల‌కు సంబంధించి అర్జీలు వ‌స్తున్నాయ‌ని.. వీటిని క్షుణ్నంగా ప‌రిశీలించి నిర్దేశ గ‌డువులోగా ప‌రిష్క‌రించ‌డం జ‌రుగుతోంద‌న్నారు. అర్జీల ప‌రిష్కారంపై నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ ఉంటోంద‌న్నారు. ఈ రోజు జ‌రిగిన గ్రీవెన్స్‌లో 106 అర్జీలు రాగా వీటిలో రెవెన్యూకు సంబంధించి 68, పంచాయ‌తీరాజ్ శాఖ‌కు సంబంధించి 9, స‌ర్వేకు సంబంధించి 8 అర్జీలు ఉన్నాయ‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు.

శాస‌న‌స‌భ్యులు శ్రీరాం రాజ‌గోపాల్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్‌ స్వయంగా మండల కేంద్రాలకు వచ్చి ప్రజల సమస్యలను తెలుసుకోవడం వల్ల వాటిని అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించే అవకాశం ఏర్పడుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆర్థిక భారం లేని సమస్యలు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణం వంటి అంశాలతో పాటు రెవెన్యూ సంబంధిత సమస్యలైన భూముల కొలతలు, రికార్డుల్లో తేడాలు, ఇతర రెవెన్యూ సమస్యలపై అధికారులు ప్రత్యక్షంగా స్పందించే అవకాశం ఉందన్నారు.

ఎన్నో ఏళ్లుగా అప‌రిష్కృతంగా ఉన్న స‌మ‌స్య‌లు కూడా ఈ కార్య‌క్ర‌మం ద్వారా ప‌రిష్కార‌మ‌వుతున్న‌ట్లు ఎమ్మెల్యే శ్రీరాం రాజ‌గోపాల్ అన్నారు. కార్య‌క్ర‌మంలో నందిగామ ఆర్‌డీవో జి.అనిల్ కుమార్, పీజీఆర్ఎస్ జిల్లా నోడ‌ల్ అధికారి జి.జ్యోతి, వివిధ శాఖ‌ల జిల్లాస్థాయి అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.