నిరుపేదలకు అండగా ప్రజా ప్రభుత్వం: ఎమ్మెల్యే వెడమ బొజ్జు

  • క్యాన్సర్‌ చికిత్సకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ మంజూరు

కడెం, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని నిరుపేదలకు ప్రజా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడమ బొజ్జు అన్నారు. కడెం మండలం ఉడుంపూర్‌ గ్రామానికి చెందిన మెంగని సువర్ణ హైదరాబాద్‌లోని ఎం.ఎన్‌.జే. క్యాన్సర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

సువర్ణకు వైద్య చికిత్స కోసం ఆర్థిక సాయం అవసరమని ఉడుంపూర్‌ గ్రామ సర్పంచ్‌ జొన్నల చంద్రశేఖర్‌ గుప్తా ఎమ్మెల్యే వెడమ బొజ్జు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే.. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ.10 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడమ బొజ్జు మాట్లాడుతూ.. నిరుపేదలకు వైద్యం అందించేందుకు ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్సకు దూరం కాకుండా అవసరమైన వారికి సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు.

క్యాన్సర్‌ చికిత్సకు రూ.10 లక్షల ఎల్‌ఓసీ మంజూరు చేయడంపై సువర్ణ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉడుంపూర్‌ గ్రామ సర్పంచ్‌ జొన్నల చంద్రశేఖర్‌ గుప్తా పాల్గొన్నారు.