Chittoor-Municipal-Elections : ద్వితీయ శ్రేణి ఆవులింత‌ Andhra Prabha Exclusive Story

Chittoor-Municipal-Elections : ద్వితీయ శ్రేణి ఆవులింత‌ Andhra Prabha Exclusive Story

  • లాబీయింగ్ క‌స‌ర‌త్తు ఫ
  • చిత్తూరులో న‌గ‌రా సంద‌డి
  • రిజర్వేషన్లు స‌రే స‌రి
  • సీట్ల‌ల్లో తువ్వాలాట ..
  • ఇంటింటికీ కూటమి బిజీబిజీ
  • వైపీపీలో మేథో మ‌ద‌నం

(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)

Chittoor-Municipal-Elections : మున్సిపల్‌ ఎన్నికల నగారా ఇంకా మోగకముందే చిత్తూరు జిల్లా పట్టణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్‌ 3న వార్డుల వారీగా ఛాయాచిత్రాలతో కూడిన ఓటర్ల జాబితాలను ప్రచురించేందుకు ముహూర్తం ఖరారు చేయడంతో రాజకీయ పార్టీల్లో కదలిక మొదలైంది. ఒకవైపు ఎన్నికల సంఘం ప్రక్రియను ముందుకు తీసుకెళ్తుండగా.. మరోవైపు రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక, వార్డుల వారీగా బలాబలాల అంచనాలు, ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలను ముమ్మరం చేస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 12న జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం 2026 జనవరి 1ను అర్హత తేదీగా తీసుకుని, ఆ తేదీకి సంబంధించి తాజాగా సవరించిన అసెంబ్లీ ఓటర్ల జాబితాల ఆధారంగా వార్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేయనున్నారు. సెప్టెంబర్‌ 3న వాటిని ప్రచురించనున్నారు. ఈ ప్రక్రియ అనంతరం ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తదుపరి చర్యలకు మార్గం సుగమం కానుంది.

టీడీపీ అధిష్ఠానం పిలుపుతో చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం చిత్తూరు, నగరి, పలమనేరు, కుప్పం పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారాన్ని తలపిస్తోంది. గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు స్థానిక సమస్యలను తెలుసుకునే పనిలో కూటమి నేతలు నిమగ్నమయ్యారు. ప్రతి వార్డులో పార్టీకి అనుకూలంగా ఉన్న బలమైన నాయకులు, కార్యకర్తలను గుర్తించడంతో పాటు రానున్న ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఇవ్వాలన్న అంశంపై అంతర్గతంగా అంచనాలు వేస్తున్నారు. దీంతో ఆశావహులు కూడా తమ బలాబలాలను నేతల ముందు చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల నోటిఫికేషన్‌ ఇంకా వెలువడకపోయినా మేయర్‌ పీఠంపై రాజకీయ ఆసక్తి భారీగా పెరిగింది. రిజర్వేషన్‌ ఏ వర్గానికి దక్కుతుందో అధికారికంగా తేలకపోవడంతో ఆశావహులంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రిజర్వేషన్‌ ఖరారైన వెంటనే ఆశావహుల జాబితాలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. టీడీపీలో మాజీ ఎమ్మెల్యే సీకే బాబు వర్గం నుంచి ఆయన సతీమణి సీకే లావణ్య పేరు ప్రధానంగా వినిపిస్తోంది. చిత్తూరు రాజకీయాల్లో సీకే బాబుకు ఉన్న పాత కేడర్‌, పరిచయాలు తమకు కలిసివస్తాయని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. మరోవైపు కాజూరు బాలాజీ కూడా మేయర్‌ రేసులో బలమైన ఆశావహుడిగా ఉన్నారు. పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం తనకు కలిసివస్తుందని ఆయన వర్గం భావిస్తోంది. మాజీ మేయర్‌ కటారి హేమలత పేరు కూడా మరోసారి చర్చలోకి వచ్చింది. మాజీ ఎమ్మెల్యే ఏఎస్‌ మనోహర్‌ కుటుంబం నుంచి ఆయన కుమారుడు వినోద్‌ పేరు వినిపిస్తోంది. మాజీ కార్పొరేటర్‌ చెరుకూరి వసంత్‌కుమార్‌, వ్యాపార వర్గాలకు చెందిన కోడి ఈశ్వర్‌బాబు పేర్లు కూడా ఆశావహుల జాబితాలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ కూడా చిత్తూరు మేయర్‌ పీఠంపై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి కార్పొరేషన్‌ టీడీపీకి కేటాయిస్తే చిత్తూరు మేయర్‌ స్థానాన్ని జనసేనకు ఇవ్వాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నట్లు సమాచారం. అలా జరిగితే జనసేన నాయకురాలు ఆరణి కవిత పేరు తెరపైకి వచ్చే అవకాశముందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రస్తుతం చిత్తూరు రాజకీయాల్లో ప్రధాన చర్చ రిజర్వేషన్‌పైనే. గత ఎన్నికల్లో మేయర్‌ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఆముద మేయర్‌గా ఎన్నికయ్యారు. ఈసారి ఓసీ జనరల్‌, ఓసీ మహిళ, బీసీ తదితర వర్గాల్లో ఏదో ఒకటి ఖరారయ్యే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. అయితే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవి ఊహాగానాలుగానే ఉన్నాయి. గత ఎన్నికల్లో చిత్తూరు కార్పొరేషన్‌లో 50 డివిజన్లకు గాను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ 46 డివిజన్లను గెలుచుకుంది. ఈసారి ఆ ఫలితాన్ని తారుమారు చేసి కార్పొరేషన్‌పై పట్టు సాధించాలని కూటమి వ్యూహాలు రచిస్తోంది. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌నాయుడు నాయకత్వంలో టీడీపీ కసరత్తు చేస్తోంది. సాధ్యమైనన్ని వార్డులను ఏకగ్రీవం చేసుకోవడంతో పాటు బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని భావిస్తోంది. వైసీపీ కూడా తమ బలమైన వార్డుల్లో కేడర్‌ను సమాయత్తం చేస్తోంది. మొత్తంగా ఓటర్ల జాబితా ప్రచురణకు ముహూర్తం ఖరారు కావడంతో మున్సిపల్‌ ఎన్నికల సన్నాహకాలకు తొలి అడుగు పడింది. ఇక రిజర్వేషన్లు, ఎన్నికల షెడ్యూల్‌ కోసం రాజకీయ పార్టీలు ఎదురుచూస్తున్నాయి. రిజర్వేషన్‌ తేలిన వెంటనే మేయర్‌, కార్పొరేటర్‌, కౌన్సిలర్‌ పదవుల కోసం లాబీయింగ్‌ మరింత ముదిరే అవకాశముంది. దీంతో చిత్తూరు పట్టణ రాజకీయాల్లో మున్సిపల్‌ ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది.