ప్ర‌ముఖ న‌టుడు నాగార్జున హెచ్చరిక

నాగార్జున బంధువుకు ‘డిజిటల్ అరెస్ట్‌’..
6 గంటలపాటు సైబర్‌ నేరగాళ్ల హైడ్రామా
కస్టమ్స్‌, పోలీసుల పేరుతో బెదిరింపులు..
నకిలీ వీడియో కాల్‌తో భయపెట్టిన వైనం..
అప్రమత్తతతో తప్పిన ముప్పు

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున సైబర్‌ నేరాల పట్ల ప్రజలను అప్రమత్తం చేస్తూ, సైబర్‌ నేరగాళ్ల మోసాలు ఎంత ప్రమాదకరంగా మారాయో ఇటీవల తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (TGCSB) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సురక్షా కా తిరంగా’ అవగాహన కార్యక్రమంలో వెల్లడించారు.

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : సైబర్‌ నేరగాళ్లు అమలు చేస్తున్న కొత్త తరహా మోసాలు ఎంత ప్రమాదకరంగా మారాయో ప్రముఖ నటుడు నాగార్జున వెల్లడించారు. తనకు అత్యంత సన్నిహితమైన బంధువును సైబర్‌ మోసగాళ్లు దాదాపు 6 నుంచి 7 గంటలపాటు ‘డిజిటల్‌ అరెస్ట్‌’లో ఉంచిన ఘటనను ఆయన వివరించారు. పోలీసు, కస్టమ్స్‌ అధికారుల పేర్లు ఉపయోగించి నమ్మించే ప్రయత్నం చేశారని తెలిపారు.

పార్శిల్‌ పేరుతో మొదలైన మోసం

నాగార్జున తెలిపిన వివరాల ప్రకారం.. తొలుత తన బంధువుకు ఓ ఫోన్‌ కాల్‌ వచ్చింది. ఆమె పేరుతో ఒక పార్శిల్‌ ఇరాన్‌కు పంపిస్తున్నారని, అందులో అనుమానాస్పద వస్తువులు ఉన్నాయని కాలర్‌ పేర్కొన్నాడు. ఆ తర్వాత తాము పోలీసులమంటూ మరో వ్యక్తి ఫోన్‌ చేశాడు. అనంతరం పోలీసు యూనిఫాంలో ఉన్న వ్యక్తితో వీడియో కాల్‌ చేయించి, పార్శిల్‌లో మాదకద్రవ్యాలు ఉన్నాయని బెదిరించినట్లు తెలిపారు.

ఇంటి నుంచి బయటకు రావొద్దంటూ ఆదేశాలు

సైబర్‌ నేరగాళ్లు ఆమెను మరింత భయపెట్టేందుకు విచారణ పేరుతో ఒత్తిడి తెచ్చారని నాగార్జున చెప్పారు. కేసు తీవ్రంగా ఉందంటూ, అధికారులకు సహకరించాలని, ఇంటి నుంచి బయటకు రావద్దని ఆదేశించారని తెలిపారు. ఇలా దాదాపు 6 నుంచి 7 గంటలపాటు ఆమెను మానసికంగా ఒత్తిడికి గురిచేశారని వెల్లడించారు.

తనకూ ఇలాంటి కాల్స్‌ వచ్చాయి

ఇలాంటి మోసపూరిత కాల్స్‌ తనకు కూడా వచ్చినట్లు నాగార్జున తెలిపారు. తన పేరు, చిరునామా వంటి వ్యక్తిగత వివరాలను ప్రస్తావిస్తూ నమ్మించే ప్రయత్నం చేశారని చెప్పారు. ప్రముఖుల పేర్లను ఉపయోగించి సైబర్‌ నేరగాళ్లు బాధితుల్లో భయం, నమ్మకం రెండింటినీ కలిగించే ప్రయత్నం చేస్తున్నారని హెచ్చరించారు. నాలుగేళ్ల క్రితం తాను కూడా సైబర్ మోసానికి గురయ్యానని నాగార్జున తెలిపారు. బ్యాంకు అధికారి పేరుతో తనకు ఫోన్ చేసి, తాము చెప్పిన స్టాక్స్‌లో పెట్టుబడి పెడితే భారీ లాభాలు వస్తాయని నమ్మబలికే ప్రయత్నం చేశారని చెప్పారు. సైబర్ నేరగాళ్లు అంతర్జాతీయ స్థాయిలో (organized) నెట్‌వర్క్‌తో ప్రజలను, సెలబ్రిటీల కుటుంబ సభ్యులను కూడా ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో గంటల తరబడి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, నకిలీ పెట్టుబడి ప్రకటనలు, తెలియని యాప్‌ల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

అప్రమత్తతతో తప్పిన ప్రమాదం

అదృష్టవశాత్తూ తన బంధువుకు పరిస్థితిపై అనుమానం వచ్చిందని నాగార్జున తెలిపారు. వెంటనే సైబర్‌ క్రైమ్‌ అధికారులను సంప్రదించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పారు.

డిజిటల్‌ అరెస్ట్‌ పేరుతో కొత్త మోసాలు

ఇటీవల కాలంలో ‘డిజిటల్‌ అరెస్ట్‌’ పేరుతో సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయి. పోలీసు, సీబీఐ, కస్టమ్స్‌, ఇతర దర్యాప్తు సంస్థల అధికారులమంటూ వీడియో కాల్స్‌ చేసి బాధితులను భయపెట్టి డబ్బులు వసూలు చేయడం ఈ మోసాల ప్రధాన పద్ధతి. నిజమైన ప్రభుత్వ అధికారులు ఫోన్‌ లేదా వీడియో కాల్‌ ద్వారా ఎవరినీ అరెస్ట్‌ చేయరని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. తెలియని వ్యక్తుల నుంచి వచ్చే కాల్స్‌, వీడియో కాల్స్‌కు స్పందించకుండా, అనుమానం వస్తే వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌ లేదా సైబర్‌ క్రైమ్‌ విభాగాన్ని సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు.