రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి: పద్మా దేవేందర్‌రెడ్డి

నిజాంపేట, ఆంధ్రప్రభ ; మండల పరిధిలోని చల్మెడ కమాన్‌ నుంచి నందగోకుల్‌ గ్రామం వరకు డాంబర్‌ రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో నస్కల్‌, నందగోకుల్‌, చల్మెడ గ్రామాల మీదుగా కమాన్‌ వరకు సుమారు 15 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి రూ.13 కోట్ల నిధులు మంజూరయ్యాయని తెలిపారు.

అసెంబ్లీ ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయని, అనంతరం తాము ఎన్నికల్లో ఓడిపోవడంతో రోడ్డు పనులను పట్టించుకునే వారు లేకుండా పోయారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు గెలిచి ఏడాది పూర్తవుతున్నా రోడ్డు పనులపై దృష్టి సారించలేదని ఆరోపించారు. దీంతో నస్కల్‌ గ్రామస్తులు నిరాహార దీక్ష చేపట్టగా, కేవలం నాలుగు కిలోమీటర్ల మేర పనులు చేపట్టి మిగిలిన రోడ్డు పనులను అర్ధంతరంగా వదిలేశారని అన్నారు.

మిగతా పనులకు సంబంధించి కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదని, స్థానిక నాయకులు కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వెంటనే రోడ్డు పనులు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. వారం రోజుల్లోగా డాంబర్‌ రోడ్డు పనులు ప్రారంభించకపోతే బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నాతో పాటు నందగోకుల్‌ నుంచి చల్మెడ కమాన్‌ వరకు పాదయాత్ర చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, కల్వకుంట సర్పంచ్‌ అందె కొండారెడ్డి, సొసైటీ చైర్మన్‌ బాపురెడ్డి, బీఆర్‌ఎస్‌వీ నియోజకవర్గ అధ్యక్షుడు బజార్‌ రంజిత్‌గౌడ్‌, మాజీ సర్పంచ్‌ గోపరి నర్సింలు, మాజీ ఎంపీపీ బిజ్జా సంపత్‌, మాజీ కోఆప్షన్‌ సభ్యులు గౌస్‌, అబ్దుల్‌ అజీజ్‌, భాస్కరరావు, వెల్దుర్తి శ్రీకాంత్‌గౌడ్‌, నాయిని లక్ష్మణ్‌, శివ, రాగుల బాబు, భూపాల్‌ తదితరులు పాల్గొన్నారు.