కరుణించవా వరుణ దేవా..
- ఇంద్రకీలాద్రిపై వరుణ యాగం..
- సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు
- నదులు, చెరువులు, జలాశయాలు నిండాలని సంకల్పం
- కృష్ణానదిలో నడుములోతు నీటిలో పండితుల వరుణ అనువాక పారాయణం
- పాల్గొన్న చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో శీనా నాయక్
( ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, నదులు, చెరువులు, జలాశయాలు నిండి రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పిస్తూ ఇంద్రకీలాద్రిపై వరుణ యాగ ప్రత్యేక పూజలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దీక్షాపూర్వకంగా ఈ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. శుక్రవారం ఉదయం 6.15 గంటలకు దుర్గా స్నానఘాట్ వద్ద విఘ్నేశ్వర పూజతో వరుణ యాగ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ఈవో వి.కె. శీనా నాయక్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
వరుణ అనువాక పారాయణం..

ఆలయ స్థానాచార్యులు శివ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పండితులు వరుణ అనువాక సహిత కారక పారాయణాలు నిర్వహించారు. పండితుల బృందం పవిత్ర కృష్ణానదిలో నడుములోతు నీటిలో నిలబడి సకాలంలో వర్షాలు కురవాలని, జలవనరులు సమృద్ధిగా నిండాలని ప్రార్థిస్తూ పారాయణాలు చేశారు.
రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పం..

రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలకు అనుకూల పరిస్థితులు ఏర్పడాలని, జలాశయాలు, చెరువులు, నదుల్లో నీటి లభ్యత పెరగాలని యాగం ద్వారా సంకల్పించారు. వరుణ దేవుడి అనుగ్రహంతో సకాలంలో వర్షాలు కురిసి ప్రజలు, రైతాంగం సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
