‘కాళేశ్వరం లేకుండానే రికార్డు పంటలా?’

రేవంత్‌పై హరీశ్‌రావు ఫైర్..
తెలంగాణ నీటి హక్కులపై పోరాడుతాం
ఆగస్టు 18న జరిగే జీఆర్‌ఎంబీ సమావేశం నాటికి ఏపీ ప్రతిపాదనలు తొలగించాలని డిమాండ్‌

హైదరాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణ నీటి హక్కులు, సాగునీటి ప్రాజెక్టుల అంశంపై అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం మళ్లీ ముదిరింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర విమర్శలు చేశారు. అర్థసత్యాలు, అబద్ధాలు, కట్టుకథలతో తెలంగాణ సాగునీటి చరిత్రను మార్చలేరని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి జలాల వినియోగం, జీఆర్‌ఎంబీ సమావేశం అంశాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.

‘కాళేశ్వరం లేకుండానే రికార్డు పంటలా?’

కాళేశ్వరం ప్రాజెక్టు లేకుండానే తెలంగాణలో రికార్డు స్థాయిలో పంటలు పండుతున్నాయని ప్రభుత్వం ప్రచారం చేస్తోందని హరీశ్‌రావు విమర్శించారు. అదే సమయంలో గోదావరి జలాలను ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా ఎత్తిపోసేలా అధికారులను ఎందుకు ఆదేశిస్తున్నారని ప్రశ్నించారు. ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, దేవాదుల, సీతారామ వంటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, చెరువులను పునరుద్ధరించడం, భూగర్భ జలాలను పెంచడం, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించడం వంటి చర్యలు సాగు విస్తీర్ణం పెరగడానికి కారణాలు కావా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

‘వాస్తవాలను దాచలేరు’

ఎల్లంపల్లి, మిడ్‌మానేరు ప్రాజెక్టులు కాళేశ్వరం వ్యవస్థతో అనుసంధానమై ఉన్న అంశాన్ని ఎంత దాచినా వాస్తవాలు మారవని హరీశ్‌రావు పేర్కొన్నారు. కాళేశ్వరం ద్వారా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు, నిజాంసాగర్‌ తదితర ప్రాజెక్టుల ఆయకట్టు స్థిరీకరణకు బాటలు పడ్డాయని ఆయన అన్నారు. మరోవైపు, మిడ్‌మానేరు కాళేశ్వరం వ్యవస్థతో అనుసంధానమై ఉన్న ప్రాజెక్టుగా ప్రభుత్వ పత్రాలు, గతంలో వెలువడిన వివరాల్లోనూ ప్రస్తావనలు ఉన్నాయి. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుపై గత కొంతకాలంగా రాజకీయంగా తీవ్ర భిన్నాభిప్రాయాలు కొనసాగుతున్నాయి.

‘సాగునీటిపై నిర్లక్ష్యం శాపంగా మారుతుంది’

వ్యవసాయం, సాగునీటి రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం తెలంగాణకు శాపంగా మారుతోందని హరీశ్‌రావు ఆరోపించారు. గోదావరి, కృష్ణా జలాల కోసం రాష్ట్రం మరోసారి ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితిని ప్రభుత్వం తీసుకొస్తోందని విమర్శించారు. అబద్ధపు ప్రచారాలు, వ్యాసాలు, సామాజిక మాధ్యమాల్లో పునఃప్రచారాలతో రైతులను మభ్యపెట్టడం ఆపాలని ఆయన సూచించారు.

జీఆర్‌ఎంబీ అజెండాపై అభ్యంతరం

తెలంగాణ నీటి హక్కులకు వ్యతిరేకంగా ఉన్నట్లు బీఆర్‌ఎస్‌ భావిస్తున్న అంశాలను గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) అజెండా నుంచి తొలగించేలా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. జీఆర్‌ఎంబీ సమావేశం ఆగస్టు 18న జరగనున్న నేపథ్యంలో, ఆ సమావేశానికి ముందే ఏపీ ప్రతిపాదనలపై తెలంగాణ ప్రభుత్వం స్పష్టమైన వైఖరి ప్రకటించాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదిత అంశాలు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, నీటి హక్కులపై ప్రభావం చూపే అవకాశం ఉందని హరీశ్‌రావు ఆరోపించారు.

‘సమావేశానికి హాజరైతే చూస్తూ ఊరుకోం’

జీఆర్‌ఎంబీ అజెండా నుంచి అభ్యంతరకర అంశాలను తొలగించకుండా ఆగస్టు 18న జరిగే సమావేశానికి తెలంగాణ ప్రభుత్వం హాజరైతే బీఆర్‌ఎస్‌ చూస్తూ ఊరుకోదని హరీశ్‌రావు హెచ్చరించారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణ కోసం జీఆర్‌ఎంబీ కార్యాలయాన్ని వేలాది మందితో ముట్టడిస్తామని ప్రకటించారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా, సాగునీటి ప్రాజెక్టుల ప్రయోజనాలు, భవిష్యత్‌ నీటి అవసరాల పరిరక్షణ కోసం ఎంతటి పోరాటానికైనా బీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉంటుందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.