కాకి-హంస ఉపాఖ్యానం.. అహంకారం నుంచి ఆత్మవిచారణ వైపు ప్రయాణం
- కాకి గర్వం.. హంస వివేకం
- అహంకారానికి ఎదురైన అసలైన పరీక్ష
- పరిమితులు తెలుసుకోవడమే వికాసానికి తొలి మెట్టు
- హంసలో కనిపించే వివేకం, అంతఃశుద్ధి
- బాహ్య విజయాల కంటే అంతరంగ వికాసమే ముఖ్యం
- తనలోని కాకిని జయించి.. హంసను మేల్కొల్పుకోవడమే సాధన
మహాభారతం కర్ణపర్వంలో శల్యుడు కర్ణుడికి చెప్పే “కాకి-హంస” ఉపాఖ్యానం ఉన్నది. సముద్రంలో ఒక విశాల ద్వీపంలో ఒక వైశ్యుని ఇంటిపై ఒకనాడొక కాకి వాలుతుంది. దాన్ని చూచిన అతని కుమారులు ప్రేమగా తాము భుజించే ఆహారాన్ని పెట్టేవారు. ఆ ఎంగిలి మెతుకులు తింటూ పెరిగిన కాకి బలంగా తయారై ఇతర పక్షులేవీ తనకు సాటిరావనే దురహంకారంతో విహరించేది. ఒకనాడు కొన్ని హంసలు సముద్రంపై విహరిస్తూ ఆ ద్వీపంపై వాలాయి. మానస సరోవరంలో హంసలు విహరిస్తూ ఉంటాయని, ఇతర రుతువులలో ఎక్కడెక్కడో విహరించి శరదృతువులో తిరిగి మానస సరోవరాన్ని చేరుకుంటాయని ప్రసిద్ధి. ఆ హంసలను చూచిన వైశ్యుని కుమారులు కాకితో.. “పక్షులన్నింటిలో గొప్పదానివైన నీవు హంసలను ఆకాశగమనంలో ఓడించాలి” అని కోరారు. అసలే దురహంకారియైన కాకికి వారి మాటలు ప్రేరణ నివ్వగా.. ఆ హంసలలో బలంగా ఉన్న ఒక హంసను పిలిచి తనతో సమానంగా ఆకాశంలో విహరించమని పోటీకి పిలిచింది. అది విన్న హంసలు.. తమతో ఆకాశంలో విహరించడం కాకికి సాధ్యంకాదని వారిస్తాయి. అయినా కాకి గర్వంతో.. తనకు “నూటఒక్క విధాలైన ఎగరడాలు తెలుసునని, అలా నూరు ఆమడల (దాదాపు ఎనిమిది మైళ్లు) ఒక ఆమడ దూరం వెళ్లగలనని చెబుతూ హంసలను గేలిచేస్తుంది. అప్పుడా హంస కొద్దిసేపు అలా సముద్రంపై విహరిద్దాము రమ్మని కాకిని పిలుస్తుంది. దానికి సరేనన్న కాకి సముద్రంపై కొంత దూరం వెళ్లగానే ఉత్సాహం తగ్గి, అలసట పెరిగి, బలహీనమై, భయంతో సముద్రపు నీటిపై పడుతుంది.
అప్పుడు హంస ఆ కాకిని కాపాడి ఒడ్డుకు చేరుస్తుంది. కాకి కూడా అహంకారం తగ్గగా హంసతో.. బలసిన దేహంతో గర్వించి నాకు ఎదురులేదనే భ్రమలో ఇన్నాళ్లూ బతికాను. నా అల్పత్వం తెలుసుకున్నాను, అంటుంది. హంస కూడా కాకిని అనునయిస్తూ.. ఇకపై గర్వంతో ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని హితవు పలికి వెళ్లిపోతుంది.
హంస-కాకి వృత్తాంతాన్ని కేవలం కాకి హంసతో పోటీపడి ఓడిపోయిన కథగా కాకుండా వ్యక్తి అహంకారం నుండి ఆత్మవిచారణ వైపు ప్రయాణించవలసిన అవసరాన్ని తెలియచేసే సందేశాత్మకమైన ప్రతీకాత్మక కథగా దర్శించవచ్చు. వ్యక్తి సాధనలో మెట్టు ఎక్కుతూ ఉన్న సమయంలో అతనిలో గంభీరంగా ప్రవర్తించింది. సముద్రాన్ని సంసారానికి ప్రతీకగా చెపుతారు. హంస సాధనలో సమర్థత, నిబద్ధత, నిలకడలను ఆశ్రయించి సంసార జలధిని ప్రతిభావంతంగా దాటగలిగింది. కాకి గర్వంతో దాటలేక చతికిలబడింది. చివరగా తన పరిమితులు అవగాహన చేసుకున్న కాకి హంసను ఆశ్రయించింది. కృపాయుత చిత్తంతో హంస గురువుగా కాకిని రక్షించి సంసార జలధిని దాటించింది.
ఆధ్యాత్మిక సాధనలో తన అశక్తతను తెలుసుకోవడం వికసనలో భాగం. అదొక మెట్టుగా భావించవచ్చు. “నాకన్నీ తెలుసు, నేనన్నీ చేయగలను” అనే అహంకారం హృదయాన్ని కమ్మేసిన కాలజ్ఞానం ప్రచ్ఛన్నంగానే ఉండిపోతుంది. తన పరిమితులు ఏమిటి? అనే ప్రశ్న మనసులో ఉదయించినప్పుడే వివేకానికి తలుపులు తెరుచుకుంటాయి.
నిజ జీవితంలో సాధకునిలో అహంకారం తన అంతర్గత శక్తి సామర్థ్యాలు, విద్య, ప్రతిభ, నైపుణ్యాల రూపంలో చింతన శక్తిని ప్రదర్శించేందుకు ప్రేరణనిస్తుంది. వివేకం జీవన ప్రయోజనాలను వెలుగులోకి తెస్తుంటుంది. దానికి ప్రశంసలు, గౌరవాలు, పదవులు, సంపద మొదలైనవి అహంకారాన్ని పెంచుతాయి. ఇతరులలో తానే గొప్ప అనుకుంటూ గర్విస్తాడు.. కానీ, జీవన గమనంలో ఎదురయ్యే పరీక్షలను ఎదుర్కొనలేని అసమర్థత చివరగా పతనానికి దారితీస్తుంది. తన అసలు సామర్థ్యం ఏమిటో తనకప్పుడు తెలిసివస్తుంది.
కథలో కాకి అహంకారానికి ప్రతీకకాగా, హంస వివేకానికి, అంతఃశుద్ధికి ప్రతీకగా భావించవచ్చు. భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయంలో హంసకు విశిష్టమైన ప్రతీకాత్మక స్థానం ఉన్నది. “హంస” అనే పదం అత్యున్నత వివేకానికి, ఆత్మనిష్ఠకు సూచకంగా కనిపిస్తుంది. అహంకారంతో కూడిన సామర్థ్యం పరిమితమైనది. కాగా వివేకంతో కూడిన ఆత్మస్థైర్యం సముద్రంలాగా అపారమైనది. కాకి పరిమిత సమర్థతతో గర్వించగా, హంస అపారమైన సముద్రంలాగా జనాలను తెలియజేస్తుంది.
అహంకారం ఇతరులతో పోల్చుకుంటుంది. వివేకం నిన్నటి మీద ఈ రోజు ఎంతగా పరిణతి చెందామో తెలియజేస్తుంది. సాధనలో కొత్త మార్గాలను అన్వేషిస్తుంది. అహంకారం బాహ్య విజయాన్ని చూస్తుంది. అందులో రమిస్తుంది. ఆత్మజ్ఞానం అంతరంగ వికసనకు, విస్తరణకు తపిస్తుంది.. స్థైర్యాన్ని ప్రదర్శిస్తుంది. బాహ్య విజయాలకు, అపజయాలకు ప్రభావితం కాని అంతరంగ విస్తరణ జీవిత సాఫల్యానికి మార్గం చూపుతుంది.. ప్రజ్ఞాపూర్ణ చిదానందాన్ని బహుమతిగా అందిస్తుంది.
మనిషి అంతరంగ ప్రయాణంలో వివేకవంతుడై.. “తనలోని కాకిని జయించి, హంసను మేల్కొల్పుకోవడమే ఆధ్యాత్మిక సాధన”.
పాలకుర్తి రామమూర్తి
