నల్సార్‌ విద్యార్థులకు ఊరట.. బీసీఐ కీలక నిర్ణయం

  • న్యాయవాదులుగా నమోదుపై ఆంక్షలు ఎత్తివేత..
  • అందరినీ శిక్షించడం సరికాదన్న బార్‌ కౌన్సిల్‌

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : హైదరాబాద్‌లోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం 2026 బ్యాచ్‌ విద్యార్థులకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ను స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన ప్రచారంలో విద్యార్థులు పాల్గొన్నారనే కారణంతో న్యాయవాదులుగా నమోదు ప్రక్రియపై విధించిన ఆంక్షలను బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) ఉపసంహరించుకుంది. నల్సార్‌ 2026 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు తమకు నచ్చిన రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదులుగా నమోదు చేసుకోవచ్చని బీసీఐ స్పష్టం చేసింది.

అందరినీ శిక్షించడం సరికాదన్న బీసీఐ

బీసీఐ చైర్మన్‌ మానన్‌ కుమార్‌ మిశ్రా జారీ చేసిన తాజా సర్క్యులర్‌లో.. ఈ అంశంపై కౌన్సిల్‌ సభ్యులు చర్చించిన అనంతరం ఆంక్షలను సవరించినట్లు పేర్కొన్నారు. “నల్సార్‌ 2026 బ్యాచ్‌లోని ఎక్కువ మంది విద్యార్థులు ఈ వ్యవహారంలో భాగస్వాములు కాదని, వారు అమాయకులని సమాచారం అందింది. ఎలాంటి తప్పు చేయని విద్యార్థులు నష్టపోకూడదు. అందుకే నమోదు నిలిపివేత ఉత్తర్వులను సవరించాం” అని బీసీఐ తెలిపింది.

బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా తీవ్ర ఆగ్రహం

జస్టిస్‌ సూర్యకాంత్‌ నల్సార్‌ స్నాతకోత్సవానికి హాజరుకావడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు విద్యార్థులు విశ్వవిద్యాలయ వైస్‌ ఛాన్సలర్‌కు లేఖ రాశారు. ఈ పరిణామాన్ని బీసీఐ తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై సమగ్ర నివేదికను ఆగస్టు 19లోపు సమర్పించాలని నల్సార్‌ వీసీని ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు సంబంధిత విద్యార్థులు దేశంలోని ఏ రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌లోనూ అడ్వకేట్‌గా నమోదు చేసుకోకూడదని తొలుత ఆదేశాలు జారీ చేసింది.

విచారణ తర్వాత తదుపరి చర్యలు

ఈ వ్యవహారంలో కొంతమంది అధ్యాపకులు, బయటి వ్యక్తులు విద్యార్థులను ప్రభావితం చేసినట్లు సమాచారం అందిందని బీసీఐ పేర్కొంది. ప్రచారాన్ని ప్రారంభించిన వారు, నిర్వహించిన వారు, సమన్వయం చేసిన వారి వివరాలతో పాటు సంబంధిత పత్రాలను అందించాలని నల్సార్‌ విశ్వవిద్యాలయాన్ని కోరింది. వీసీ నుంచి విచారణ నివేదిక అందిన తర్వాత ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీఐ వెల్లడించింది. ప్రస్తుతం మాత్రం 2026 బ్యాచ్‌ విద్యార్థుల న్యాయవాదుల నమోదు ప్రక్రియకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.