అనుమానాలుంటే.. అసెంబ్లీకి రావాలి
- శాసనసభ వేదికగా ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతాం
- కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసింది
- మంత్రి కందుల దుర్గేష్
నిడదవోలు, ఆంధ్రప్రభ: డీఎస్సీ నియామకాలపై వైసీపీ నేతలకు ఏమైనా అనుమానాలు ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరం ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో ఏపీపీఎస్సీ వ్యవస్థను నిర్వీర్యం చేసి, దాని ప్రతిష్టను దిగజార్చడంతో పాటు నిరుద్యోగ యువత భవిష్యత్తుతో చెలగాటమాడారని దుర్గేష్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీలో జరిగిన అక్రమాలు, అవకతవకలకు గ్రూప్-1 నియామకాలపై సిట్ సమర్పించిన 132 పేజీల నివేదికే నిదర్శనమన్నారు.
నిబంధనలకు విరుద్ధంగా మూల్యాంకనాలు నిర్వహించడం, జవాబుపత్రాల్లో మార్కుల మార్పులు, రీవాల్యుయేషన్ పేరుతో అక్రమాలకు పాల్పడటం వంటి అంశాలు సిట్ నివేదికలో వెలుగులోకి వచ్చాయని తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధిత అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తొలి సంతకం డీఎస్సీ ఫైలుపైనే చేశారని దుర్గేష్ తెలిపారు. అనంతరం కేవలం 148 రోజుల్లో 16,347 ఉపాధ్యాయ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేసినట్లు పేర్కొన్నారు.
డీఎస్సీలో ఉద్యోగం సాధించలేకపోయిన అభ్యర్థులు నిరాశ చెందాల్సిన అవసరం లేదన్నారు. అక్టోబర్‌లో మరో డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని తెలిపారు. నిరుద్యోగ యువత వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని నమ్మకుండా, రానున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఇప్పటి నుంచే సిద్ధం కావాలని సూచించారు.
డీఎస్సీ నియామకాలపై వైసీపీ నేతలకు నిజంగా ఏమైనా సందేహాలు ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని దుర్గేష్ అన్నారు. శాసనసభ వేదికగా ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
