AP Deputy CM | ఏనుగులు దేశ వన్యప్రాణి వారసత్వానికి ప్రతీకలు
AP Deputy CM | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఏనుగులు భారతదేశ వన్యప్రాణి వారసత్వానికి ప్రతీకలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ–పర్యావరణ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. అడవుల సంరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో ఏనుగులు కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ఏనుగుల సంరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ హోటల్లో నిర్వహించిన ప్రపంచ ఏనుగుల దినోత్సవం కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌తో కలిసి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏనుగుల సంరక్షణ, మనిషి–ఏనుగు ఘర్షణల నియంత్రణ, వన్యప్రాణుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా ఏనుగుల ఆవాసాలు, సంచార మార్గాలను కాపాడటానికి ప్రత్యేక చర్యలు అవసరమని అన్నారు.
‘ప్రాజెక్ట్ ఎలిఫెంట్’ను మరింత బలోపేతం చేయడంతో పాటు ఏనుగుల కారిడార్ల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ఏనుగుల కదలికలను పర్యవేక్షించడం, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మరింత సమర్థంగా అమలు చేయడం ద్వారా మనిషి–వన్యప్రాణుల ఘర్షణలను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం సుమారు 132 నుంచి 142 అడవి ఏనుగులు ఉన్నాయని పవన్ కల్యాణ్ వెల్లడించారు. వాటిని సంరక్షించడం రాష్ట్రానికి గర్వకారణమే కాకుండా బాధ్యత కూడా అని అన్నారు. ఏనుగుల రక్షణతో పాటు వాటి వల్ల ప్రజలు, రైతులకు ఎదురయ్యే ఇబ్బందులను తగ్గించడం కూడా ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారు.
మనిషి–ఏనుగు ఘర్షణలను నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అటవీ శాఖల మధ్య సమన్వయంతో చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కర్ణాటక అటవీ శాఖ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌కు నాలుగు కుంకీ ఏనుగులు అందాయని చెప్పారు. వీటి కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. కుంకీ ఏనుగుల సహాయంతో ఇప్పటికే 15 మనిషి–ఏనుగు ఘర్షణ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించినట్లు వెల్లడించారు.
ఈ చర్యల వల్ల ఏనుగుల సంచారం కారణంగా జరిగే మానవ ప్రాణనష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో మనిషి–వన్యప్రాణుల ఘర్షణల నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వన్యప్రాణులు జనావాసాల్లోకి ప్రవేశించినప్పుడు వేగంగా స్పందించేందుకు అటవీ శాఖను మరింత సన్నద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.
వన్యప్రాణుల రక్షణ కోసం 100 ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. ఇప్పటివరకు 200కు పైగా వన్యప్రాణులను రక్షించినట్లు తెలిపారు. రైతులకు సకాలంలో హెచ్చరికలు అందించడం, అటవీ సిబ్బందికి ఆధునిక పరికరాలు, ప్రత్యేక శిక్షణ కల్పించడం, వన్యప్రాణులకు సురక్షితమైన ఆవాసాలను అభివృద్ధి చేయడం తమ ప్రధాన లక్ష్యాలని వివరించారు.
వన్యప్రాణుల సంరక్షణ ప్రభుత్వం ఒక్కదాని బాధ్యత కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ప్రజలను భాగస్వామ్యం చేసి వన్యప్రాణుల సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏనుగుల సంరక్షణపై దేశవ్యాప్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో 21,450 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. విద్యార్థుల్లో కనిపించిన చైతన్యం, ఉత్సాహాన్ని అభినందించారు.
అభివృద్ధికి బాధ్యత ఉండాలి.. సంరక్షణకు లక్ష్యం ఉండాలి అని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు సమతుల్యతతో చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఏనుగులు, ఇతర వన్యప్రాణులకు సురక్షితమైన ఆవాసాలు కల్పిస్తూ, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాస్త్రీయ విధానాల్లో ఘర్షణలను నియంత్రించేందుకు చర్యలు కొనసాగిస్తామని చెప్పారు.
