గణపతి నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు షురూ..

గుడివాడ, ఆంధ్రప్రభ : ప్రజలందరిపై విఘ్నాలు తొలగించే శ్రీ విగ్నేశ్వర స్వామి వారి కరుణాకటాక్షాలు ఉండాలని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఆకాంక్షించారు. స్వామివారి ఆశీస్సులతో ఈ ఏడాది గణపతి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరగాలన్నారు. గుడివాడ పట్టణంలోని ప్రసిద్ధ మెయిన్‌రోడ్డులో కొలువై ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.

సెప్టెంబర్ 14వ తేదీ నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాల ఆహ్వాన పత్రికలను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం ఉదయం రాజేంద్రనగర్‌లోని తన స్వగృహంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దేవస్థాన ధర్మకర్తల కమిటీ చైర్మన్ సాయన రాజేష్, ఈవో యార్లగడ్డ వాసు ఎమ్మెల్యే వెనిగండ్ల రామును కలిసి ఉత్సవాల నిర్వహణకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్న నవరాత్రి మహోత్సవాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ఎమ్మెల్యే రాము సూచించారు. ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా, భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన కమిటీ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ…విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వర స్వామివారి ఆశీస్సులతో ఈ ఏడాది గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరగాలని ఆకాంక్షించారు. గుడివాడ పట్టణంతో పాటు నియోజకవర్గంలోని ప్రజలందరిపై ప్రథమ పూజ్యుడైన గణపతి స్వామివారి కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని స్వామివారిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

గుడివాడ నియోజకవర్గంలో జరిగే గణపతి నవరాత్రి మహోత్సవాల నిర్వహణకు నా సంపూర్ణ సహకారం ఉంటుందనీ ఎమ్మెల్యే రాము చెప్పారు.ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో గణపతి నవరాత్రి మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్తల కమిటీ సభ్యులు లోయ వాసు, పంచమర్తి శ్రీనివాస్, విక్కుర్తి పోతురాజు, ముళ్ళపూడి రమణమూర్తి, వీరమాచనేని శైలజ, దేవస్థాన సిబ్బంది నారాయణ తదితరులు పాల్గొన్నారు.