వైభవంగా చౌడేశ్వరి దేవి అమ్మవారి జన్మదిన వేడుకలు
నందికొట్కూరు, ఆంధ్రప్రభ:నందికొట్కూరు పట్టణంలోని శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జన్మదిన వేడుకలు బుధవారం వైభవంగా నిర్వహించారు. వేలాది మంది భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. భక్తుల జై చౌడేశ్వరి మాత నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.
ఆలయ ప్రెసిడెంట్ వీరనాల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి చట్టా మురళి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉదయం నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారిని రంగురంగుల పూలమాలలు, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు భక్తులకు హారతి ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు.
పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు సైతం బారులు తీరి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.
సాయంత్రం నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రెసిడెంట్ వీరనాల ప్రసాద్, ప్రధాన కార్యదర్శి చట్టా మురళి మాట్లాడుతూ.. అమ్మవారి కృపతో ప్రతి ఏటా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. వేడుకల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం సంతోషంగా ఉందని, వారి సహకారం మరువలేనిదని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ.. చౌడేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
