భూ సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు

కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

  • రెవెన్యూ సమస్యలను నిర్ణీత గడువులో పరిష్కరించాలి
  • అధికారులకు ఆదేశాలు

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ బ్యూరో: భూ సమస్యల పరిష్కారంలో అధికారులు, సిబ్బంది అలసత్వం వహించరాదని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. ప్రజల రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించి, వారికి మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.

రెవెన్యూ సమస్యల పరిష్కారంపై శ్రీకాకుళం డివిజన్ స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన బుధవారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భూ సమస్యలు, మ్యుటేషన్లు, పట్టాదారు పాస్‌బుక్‌లు, భూ రికార్డుల సవరణలు, సరిహద్దు వివాదాలు, ఆదాయ, కుల, నివాస ధ్రువపత్రాల జారీ వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజల నుంచి అందుతున్న రెవెన్యూ సమస్యలను నిర్ణీత సమయంలో పరిష్కరించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సత్వర సేవలు అందించాలని ఆదేశించారు.

ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా పారదర్శకంగా, జవాబుదారీతనంతో రెవెన్యూ సేవలు అందించాలని అధికారులకు సూచించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం చూపితే సహించేది లేదని స్పష్టం చేశారు.

వీఆర్వోలకు మ్యుటేషన్ ప్రక్రియపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. క్షేత్రస్థాయికి వెళ్లే రెవెన్యూ సిబ్బంది మొబైల్ యాప్‌లను వినియోగించి విచారణ నివేదికలను నమోదు చేయాలని, రికార్డులను పక్కాగా నిర్వహించాలని సూచించారు. 1బి డాక్యుమెంటేషన్‌లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.

డివిజన్ పరిధిలోని రెవెన్యూ సమస్యలను ఆర్డీవోలు క్షేత్రస్థాయిలో పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. పరిష్కరించిన సమస్యల వివరాలను ఎప్పటికప్పుడు సమీక్షకు సమర్పించాలని, పెండింగ్ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ మాట్లాడుతూ.. రెవెన్యూ సమస్యలకు సంబంధించిన సమాచారం కింది స్థాయి సిబ్బంది వరకు ఎందుకు చేరడం లేదని అధికారులను ప్రశ్నించారు. సర్వేయర్లు, వీఆర్వోలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సాంకేతికతను వినియోగించుకుని సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని, కృత్రిమ మేధస్సు వంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలని తెలిపారు.

సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ (శిక్షణ) హరి ఓం పాండియా, జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు, ఏడీ సర్వే జోషిల, రెవెన్యూ డివిజనల్ అధికారి సాయి ప్రత్యూష, రెవెన్యూ పరిపాలన అధికారి సూర్యనారాయణతో పాటు పలువురు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.