ఇంటింటా టీడీపీ జోరు..

  • పశ్చిమలో దూసుకెళ్తున్న ‘బుద్ధా’ బృందం
  • ప్రతి గడపకు టీడీపీ శ్రేణులు..
  • సంక్షేమం, అభివృద్ధిని వివరిస్తున్న పార్టీ శ్రేణులు
  • ప్రజల సమస్యలపై ఆరా..
  • పరిష్కారానికి కార్యాచరణ
  • బుద్దా వెంకన్న నేతృత్వంలో పార్టీ శ్రేణుల విస్తృత పర్యటన..
  • రాష్ట్రంలో నాలుగో స్థానం..
  • 98 శాతం ఇళ్ల సందర్శన పూర్తి..

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ: పశ్చిమ నియోజకవర్గంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం జోరందుకుంది. ఇటీవల నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టిన టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బుద్ధా వెంకన్న నేతృత్వంలో పార్టీ శ్రేణులు ప్రతి గడపనూ తడుతున్నాయి. కేవలం పార్టీ కార్యక్రమానికే పరిమితం కాకుండా ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు, అవసరాలు, అభిప్రాయాలను తెలుసుకుంటూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతున్నాయి. ఇప్పటివరకు 98% ఇళ్లను సందర్శించి రాష్ట్రంలోనే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గం మూడో స్థానంలో నిలిచింది.

మూడో స్థానంలో పశ్చిమం..

కేంద్ర పార్టీ కార్యాలయం తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 83,398 ఇళ్లకు గాను 81,697 ఇళ్లను టీడీపీ శ్రేణులు సందర్శించాయి. దీంతో 97.96 శాతం ఇళ్లను కవర్‌ చేసినట్లయింది. అంతకుముందు రాత్రి నివేదికలో 80,077 ఇళ్లను సందర్శించినట్లు నమోదుకాగా, ఒక్కరోజులోనే మరో 1,620 ఇళ్లను సందర్శించడం కార్యక్రమం వేగాన్ని తెలియజేస్తోంది. రాష్ట్రస్థాయిలో పశ్చిమ నియోజకవర్గం నాలుగో స్థానంలో నిలిచినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

సంక్షేమం.. అభివృద్ధిపై అవగాహన..

ఇంటింటికీ వెళ్లిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. అర్హులైన కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకుంటున్నారు. స్థానికంగా ఉన్న రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సమస్యలను ప్రజల నుంచి నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

బుద్ధా రాకతో కేడర్‌లో కొత్త ఉత్సాహం..

పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జిగా బుద్ధా వెంకన్న బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆగస్టు 9న వెల్లడైన నివేదికలోనే కార్యక్రమం 50 శాతం పూర్తయినట్లు బుద్ధా వెంకన్న ప్రకటించారు. తాజాగా 97.96 శాతం ఇళ్లను సందర్శించినట్లు గణాంకాలు వెల్లడించడం ద్వారా కార్యక్రమం ఏ స్థాయిలో విస్తృతంగా కొనసాగుతోందో స్పష్టమవుతోంది. పార్టీ అధిష్ఠానం జూలైలో బుద్ధా వెంకన్నకు పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించగా, ఆగస్టు 8న ఆయన బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి గడపగడపకూ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవడం, పరిష్కారానికి చొరవ చూపడం, కూటమి ప్రభుత్వ సంక్షేమ–అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై పార్టీ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. దాదాపు 98 శాతం ఇళ్లకు చేరువ కావడం ద్వారా పశ్చిమలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమం విస్తృతిని చాటుతోంది.

కార్యకర్తలను ప్రోత్సహిస్తూ..

ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో విశేష ప్రతిభ కనబరిచిన కార్యకర్తలను నాయకులను బుద్దా వెంకన్న ప్రత్యేకంగా గౌరవిస్తూ ప్రోత్సహిస్తున్నారు. మరి ముఖ్యంగా ఎక్కువ ఇల్లు సందర్శించిన ఐదుగురు కార్యకర్తలకు నగదు పారితోషికాన్ని సైతం అందిస్తున్నారు. ఇటీవల అత్యధిక ఇల్లు సందర్శించిన నాయకులు కార్యకర్తల్లో ఐదుగురిని ఎంపిక చేసిన ఆయన నగదు ప్రోత్సాహాలు ఇవ్వడంతో పాటు వారిని సాలువాలతో సన్మానించి అభినందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన బుద్దా వెంకన్న ప్రోత్సహిస్తుండడం గడపగడపకు వెళుతుండడంతో అటు నాయకుల్లో ఇటు కార్యకర్తల్లో అటు ప్రజల్లో కూడా మంచి స్నేహపూర్వక వాతావరణం ప్రశంసలు అభినందనలు వస్తున్నాయి.