బ్రేకులు ఫెయిల్‌.. ఇంటి ఆవరణలోకి దూసుకెళ్లిన డీసీఎం

నందిగామ రూరల్‌, ఆంధ్రప్రభ: నందిగామ మండలం అంబారుపేట గ్రామంలో డీసీఎం లారీ బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ఓ ఇంటి ఆవరణలోకి దూసుకెళ్లింది. మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ఇంటి ఆవరణలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు.

డ్రైవర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం నుంచి పెనుగంచిప్రోలు గ్రామానికి డీసీఎం లారీ వెళ్తోంది. అంబారుపేట వద్దకు చేరుకునే సమయంలో లారీ బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి. ఎదురుగా ఉన్న వారిని తప్పించే క్రమంలో డ్రైవర్‌ లారీని పక్కకు మళ్లించడంతో అదుపుతప్పి సమీపంలోని ఇంటి ఆవరణలోకి దూసుకెళ్లింది.

సమాచారం అందుకున్న నందిగామ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం కారణంగా ఏర్పడిన ట్రాఫిక్‌ అంతరాయాన్ని తొలగించి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. లారీ డ్రైవర్‌ను అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు.

అయితే లారీ డ్రైవర్‌ మద్యం సేవించి వాహనం నడిపాడా? అనే అనుమానాలను కొందరు స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టి వాస్తవాలను నిర్ధారించాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేయడంతో పాటు డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించేందుకు చర్యలు తీసుకున్న నందిగామ పోలీసులను స్థానికులు అభినందించారు.