లక్నవరం నీటితో పంటలను కాపాడుతాం
సాగునీటి సమస్యపై రైతులకు పైడాకుల అశోక్ హామీ
గోవిందరావుపేట, ఆంధ్రప్రభ: వర్షాభావ పరిస్థితులతో పంటలు ఎండిపోయే ప్రమాదం నెలకొన్న నేపథ్యంలో రైతుల సాగునీటి సమస్యపై ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ స్పందించారు. లక్నవరం సరస్సులో నీరు అందుబాటులో ఉన్నందున పంట కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేయించేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు.
మంగళవారం గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలోని తన నివాసం వద్ద మండలంలోని రైతులతో అశోక్ సమావేశమై వారి సాగునీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. లక్నవరం సరస్సులో నీరు ఉన్నప్పటికీ పంట కాలువలకు నీరు విడుదల కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
రైతుల ఆవేదనను అర్థం చేసుకున్న అశోక్ వెంటనే స్పందించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలను కాపాడేందుకు లక్నవరం సరస్సు నుంచి పంట కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేయించేలా సంబంధిత అధికారులతో మాట్లాడతానని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సాగునీటి పరిస్థితిని పర్యవేక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతామని చెప్పారు.
పంటలు చేతికొచ్చే వరకు రైతులకు అండగా ఉంటామని, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని అశోక్ పేర్కొన్నారు. రైతుల సమస్యలను తెలుసుకుని వెంటనే స్పందించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి పలువురు రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
