మెగా డీఎస్సీపై ఆరోపణలు సరికాదు: రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఏపీఎస్‌ఆర్టీసీ విజయవాడ జోనల్‌ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్‌చార్జి రెడ్డి అప్పలనాయుడు అన్నారు. మెగా డీఎస్సీని పారదర్శకంగా, అక్రమాలకు తావులేకుండా నిర్వహిస్తున్నారని తెలిపారు.

సోమవారం జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేయడం సరికాదన్నారు. రేయింబవళ్లు కష్టపడి చదివి ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన నిరుద్యోగ యువత కష్టాన్ని తక్కువ చేసి చూడొద్దని సూచించారు. 2025 మెగా డీఎస్సీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను ఉపసంహరించుకోవాలని కోరారు.

చట్టానికి లోబడి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు, ఆందోళనలు చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అయితే చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తే ప్రభుత్వం ఉపేక్షించదని అప్పలనాయుడు అన్నారు. మెగా డీఎస్సీకి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న నిరసనలు శృతిమించకూడదని పేర్కొన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించలేదని ఆయన విమర్శించారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ వచ్చినప్పటి నుంచి అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు జరిగాయని, వాటిని అధిగమించి మంత్రి నారా లోకేష్ డీఎస్సీని నిర్వహిస్తున్నారని తెలిపారు.

మెగా డీఎస్సీ ద్వారా సుమారు 16 వేల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతోందని, ఉద్యోగాలు సాధించిన అభ్యర్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. డీఎస్సీపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై ఉపాధ్యాయ వర్గాలు స్పందిస్తున్నాయని తెలిపారు.

సమావేశంలో నగర అధ్యక్షుడు వీరంకి పండు, గౌరవ అధ్యక్షుడు నగిరెడ్డి కాశి నరేష్, నాయకులు రెడ్డి గౌరీశంకర్, సరిది రాజేష్, ఎట్రించి ధర్మేంద్ర, బెజవాడ నాగభూషణం కుమార్, పైడి లక్ష్మణరావు, బోండా రాము నాయుడు, జనసేన రవి, ములికి శ్రీనివాస్, వాసా సాయి తదితరులు పాల్గొన్నారు.