సామాజిక భద్రతలో ఏపీ దేశానికే ఆదర్శం

విజయవాడ రూరల్, ఆంధ్రప్రభ: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన యూనిట్‌ ఇన్‌చార్జిల శిక్షణ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, కమిటీల విధులు, బాధ్యతలు, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై యూనిట్‌ ఇన్‌చార్జిలకు దిశానిర్దేశం చేశారు. బూత్‌, యూనిట్‌ ఇన్‌చార్జిలే క్షేత్రస్థాయిలో పార్టీకి కీలకమైన వారధులని, ప్రతి కార్యకర్తతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా పనిచేయాలని సూచించారు. ప్రతి ఇంటితో సంబంధాలు పెంచుకోవడంతో పాటు ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు.

సామాజిక భద్రతలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా నిలిచి దేశానికే ఆదర్శంగా మారిందని దేవినేని ఉమా అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు. పెన్షన్లు, మహిళా సంక్షేమం, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి–నైపుణ్య అవకాశాలు, పేదల సంక్షేమం వంటి రంగాల్లో ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు అనుకూలంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై వాస్తవాలను ప్రజలకు వివరించడంతో పాటు ప్రతిపక్షాల అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని, సాంకేతికత, సామాజిక మాధ్యమాలను సమర్థంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, నారా లోకేష్‌ ఆధ్వర్యంలో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త సమన్వయంతో పనిచేయాలని కోరారు.