ప్రతి రైతు పంట పొలంలో నీటి కుంట నిర్మించుకోవాలి

ఉపాధి హామీ పథకంలో ఉచితంగా నిర్మాణం

కమ్మర్‌పల్లి, ఆంధ్రప్రభ: రైతులు తమ పంట పొలాల్లో వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి, భూగర్భ జలాలను పెంచడానికి, వేసవిలో సాగునీటి కొరతను అధిగమించడానికి పంట కుంటలు నిర్మించుకోవడం ఎంతో ప్రయోజనకరమని కమ్మర్‌పల్లి గ్రామ సర్పంచ్ కొత్తపల్లి హారిక అశోక్, ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ అన్నారు.

సోమవారం కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని పసుపు పరిశోధన కేంద్రంలో పంట కుంట నిర్మాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు తక్కువగా కురుస్తున్న నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని నిల్వ చేసుకునేందుకు రైతులు పంట కుంటలను నిర్మించుకోవాలని సూచించారు.

పంట కుంటల నిర్మాణంతో బోరుబావుల్లో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడంతో రైతులు ఎలాంటి ఖర్చు లేకుండా పంట కుంటలను నిర్మించుకోవచ్చని చెప్పారు.

వర్షపు నీటిని పొలంలో ఎక్కడ నిల్వ చేసుకోవాలో గుర్తించి, ఉపాధి సిబ్బంది సూచించిన కొలతల ప్రకారం ఉపాధి హామీ కూలీలతో పంట కుంటలను నిర్మిస్తారని వివరించారు. పంట కుంటల ద్వారా వర్షాభావ పరిస్థితుల్లోనూ పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు.

ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, వర్షపు నీటి సంరక్షణకు అవి ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజలకు, రైతులకు ఇంకుడు గుంతలు, పంట కుంటల ప్రయోజనాలను వివరించి వంద శాతం నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ హారిక అశోక్, ఉప సర్పంచ్ అశోక్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ పసుపుల లక్ష్మి రమ, జెల్ల రాకేష్, గ్రామపంచాయతీ సిబ్బంది రామంజి, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.