వర్షాలు కురవాలని.. మొసలికి పూజలు!

వర్షాలు కురవాలని.. మొసలికి పూజలు!

గద్వాల జిల్లాలో ఆసక్తికర ఘటన.. కృష్ణానది ఒడ్డుకు కొట్టుకొచ్చిన మొసలి

గద్వాల, ఆంధ్రప్రభ: వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ ఓ మొసలికి పూజలు చేసిన ఘటన గద్వాల జిల్లాలో ఆసక్తికరంగా మారింది. కృష్ణానది ఒడ్డుకు కొట్టుకొచ్చిన మొసలిని స్థానికులు వరుణదేవుడి వాహనంగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గద్వాల జిల్లా బీచుపల్లి వద్ద కృష్ణానది ఒడ్డుకు ఓ మొసలి కొట్టుకొచ్చింది. దీనిని గమనించిన జాలర్లు తాళ్ల సాయంతో మొసలిని ఒడ్డుకు తీసుకొచ్చారు. అనంతరం మొసలిని చూసేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

మొసలిని వరుణదేవుడి వాహనంగా భావించిన స్థానికులు.. వర్షాలు సమృద్ధిగా కురవాలని పూజలు చేయాలని నిర్ణయించారు. దీంతో పురోహితుడు అనిల్ శర్మ ఆధ్వర్యంలో మొసలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని కోరుకుంటూ పూజలు చేశారు. పూజలు పూర్తయిన అనంతరం అధికారులు మొసలిని సురక్షితంగా తిరిగి కృష్ణానదిలోకి విడిచిపెట్టారు. దీంతో అక్కడ గుమిగూడిన ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. మొసలికి పూజలు నిర్వహించిన ఘటన ప్రస్తుతం స్థానికంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.