కోడిపందేల స్థావరంపై పోలీసుల దాడి..

సదాశివనగర్, ఆంధ్రప్రభ: సదాశివనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని తిర్మాన్‌పల్లి గ్రామ శివారులో ఇటుక బట్టీ ప్రాంగణంలో కోడిపందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా కోడిపందేల్లో పాల్గొన్న 12 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై ఎం. పుష్పరాజ్ తెలిపారు. వారి నుంచి 9 ద్విచక్ర వాహనాలు, 3 కార్లు, 11 సెల్‌ఫోన్లు, రూ.45,050 నగదు, 65 కోడిపందేల కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

పోలీసులు దాడి చేస్తున్న సమయంలో కొంతమంది అక్కడి నుంచి పరారయ్యారని, వారిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు. ఈ ఘటనపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు చట్టవిరుద్ధమైన కోడిపందేలు, జూదం వంటి కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ఇలాంటి కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.