51 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలి !
- భారత్ ప్రపంచకప్ సాధించాలి.. 1975 హాకీ హీరోల పిలుపు
- దేశం కోసం ఆడండి.. స్వర్ణమే లక్ష్యంగా ముందుకు సాగండి: అశోక్‌కుమార్, అస్లాం షేర్‌ఖాన్
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : గత 51 ఏళ్లుగా భారత హాకీ అభిమానుల కళ్లలో ఒకే ఒక్క కల. ప్రపంచకప్ వేదికపై భారత్ మళ్లీ విశ్వవిజేతగా నిలవాలి. 1975లో పాకిస్థాన్‌ను ఓడించి ప్రపంచకప్‌ను ముద్దాడిన ఆ చారిత్రాత్మక విజయం మరోసారి పునరావృతం కావాలన్నదే కోట్లాది అభిమానుల ఆకాంక్ష.
1975లో జరిగిన ప్రపంచకప్ ఫైనల్లో పాకిస్థాన్‌ను 2-1తో ఓడించి భారత్ తొలిసారి ప్రపంచ చాంపియన్‌గా అవతరించింది. ఆ విజయం భారత హాకీ చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయింది. అయితే ఆ తర్వాత ప్రపంచకప్‌లో భారత్ మళ్లీ పతకం సాధించలేకపోయింది. దీంతో 51 ఏళ్లుగా ఆ పతకం కోసం ఎదురుచూపులు కొనసాగుతున్నాయి.
ఇప్పుడు మరో ప్రపంచకప్ సమీపిస్తున్న వేళ.. 1975 నాటి చారిత్రాత్మక జట్టులోని దిగ్గజాలు ప్రస్తుత ఆటగాళ్లకు కీలక సందేశం ఇస్తున్నారు. వ్యక్తిగత లక్ష్యాలను పక్కన పెట్టి దేశం కోసం ఆడాలని, జాతీయ జెండా కోసం మైదానంలో పూర్తి స్థాయి పోరాట స్ఫూర్తిని ప్రదర్శించాలని కోరుతున్నారు
ఆగస్టు 15 నుంచి 30 వరకు నెదర్లాండ్స్, బెల్జియం వేదికలుగా పురుషుల హాకీ ప్రపంచకప్ జరగనుంది. ఈసారి ప్రపంచకప్ బరిలోకి దిగుతున్న భారత జట్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. టోక్యో 2021, పారిస్ 2024 ఒలింపిక్స్‌లో వరుసగా కాంస్య పతకాలు సాధించిన హర్మన్‌ప్రీత్‌సింగ్ సేన.. ప్రపంచకప్‌లోనూ సత్తా చాటాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే సమయంలో 1975 ప్రపంచకప్ విజేతలు అశోక్‌కుమార్, అస్లాం షేర్‌ఖాన్ తమ అనుభవాన్ని జట్టుతో పంచుకున్నారు.
ఆ ఒక్క గోల్.. భారత హాకీ చరిత్రను మార్చింది..
1975.. కౌలాలంపూర్. ప్రపంచకప్ ఫైనల్. ప్రత్యర్థి పాకిస్థాన్. మైదానంలో ఉత్కంఠ తారస్థాయికి చేరింది. భారత్-పాకిస్థాన్ పోరులో ఒక్క గోల్ మ్యాచ్ గమనాన్నే మార్చేసే పరిస్థితి. అలాంటి సమయంలో 51వ నిమిషంలో అశోక్‌కుమార్ కొట్టిన గోల్ భారత హాకీ చరిత్రలో సువర్ణాక్షరంగా నిలిచిపోయింది. చివరకు భారత్ 2-1తో పాకిస్థాన్‌ను ఓడించి తొలిసారి ప్రపంచకప్ విజేతగా అవతరించింది. ఆ విజయం తర్వాత మాత్రం ప్రపంచకప్‌లో భారత్‌కు మరోసారి పతకం దక్కలేదు. అలా మొదలైన నిరీక్షణ ఇప్పుడు 51 ఏళ్లకు చేరింది. ‘ఈసారి ఆ నిరీక్షణకు తెరపడాలి’ అని అశోక్‌కుమార్ బలంగా ఆకాంక్షించారు.
ప్రస్తుత ఆటగాళ్లు మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు తమ వ్యక్తిగత ప్రదర్శన గురించి కాకుండా దేశం కోసం ఆడుతున్నామనే భావనతో ఉండాలని అశోక్‌కుమార్ సూచించారు. విజయం సాధించినా, ఓటమి ఎదురైనా దాన్ని వ్యక్తిగతంగా చూడకుండా దేశానికి సంబంధించినదిగా భావించాలని చెప్పారు. ‘‘51 ఏళ్లుగా ప్రపంచకప్ పతకం కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు ఆ నిరీక్షణకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది’’ అన్న భావనతో జట్టు ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
అస్లాం షేర్‌ఖాన్ కూడా ఇదే విషయాన్ని గుర్తుచేశారు. 1975లో తాము దేశాన్ని తల్లిగా భావించి మైదానంలోకి దిగామని, అదే స్ఫూర్తి నేటి ఆటగాళ్లలోనూ ఉండాలని చెప్పారు. దేశం కోసం ఆడుతున్నామనే భావన బలంగా ఉంటే ఒత్తిడిని అధిగమించి గొప్ప ఫలితాలు సాధించవచ్చని అన్నారు.
1975లో ప్రపంచకప్ సాధించిన జట్టులోని ఆటగాళ్లకు కూడా అంతకుముందు నిరాశలు ఎదురయ్యాయి. 1971 ప్రపంచకప్‌లో భారత్ కాంస్య పతకం సాధించింది. 1973లో రజతంతో సరిపెట్టుకుంది. ఆ రెండు టోర్నీల్లోనూ స్వర్ణం చేజారడం ఆటగాళ్లను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో స్వర్ణం కోసం మరింత పట్టుదలతో ముందుకు సాగింది. ఆ కసి, ఆత్మవిశ్వాసమే 1975లో భారత్‌ను విశ్వవిజేతగా నిలిపింది.
1971లో సెమీఫైనల్లో ఎదురైన ఓటమి తర్వాత కోచ్ బల్బీర్‌సింగ్ సీనియర్ తీవ్ర భావోద్వేగానికి గురైన విషయాన్ని అశోక్‌కుమార్ గుర్తుచేసుకున్నారు. 1973లో రజత పతకంతో సరిపెట్టుకోవాల్సి రావడం కూడా జట్టులో ఎలాగైనా స్వర్ణం సాధించాలన్న కసిని పెంచిందన్నారు.
1975 ప్రపంచకప్ కోసం చండీగఢ్‌లో నిర్వహించిన శిక్షణ శిబిరంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆటగాళ్లంతా ఒకే లక్ష్యంతో సాధన చేశారని అస్లాం షేర్‌ఖాన్ చెప్పారు. జర్మనీ, హాలండ్, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లను తాము ఎప్పుడూ తమకంటే గొప్పగా భావించలేదని, ఆత్మవిశ్వాసమే తమ బలంగా మారిందని గుర్తుచేశారు.

ఒలింపిక్స్ వేరు.. ప్రపంచకప్ వేరు !
హర్మన్‌ప్రీత్‌సింగ్ నాయకత్వంలోని ప్రస్తుత భారత జట్టు ఇప్పటికే టోక్యో, పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా కాంస్య పతకాలు సాధించింది. అయితే ప్రపంచకప్ వేదికపై పరిస్థితులు, ఒత్తిడి భిన్నంగా ఉంటాయని అస్లాం షేర్‌ఖాన్ అభిప్రాయపడ్డారు. పారిస్ ఒలింపిక్స్‌లో చూపించిన పోరాట స్ఫూర్తిని ప్రపంచకప్‌లోనూ కొనసాగిస్తే 51 ఏళ్ల తర్వాత భారత హాకీకి మరో ప్రపంచకప్ పతకం దక్కుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
మైదానంలో ఆటగాళ్లు పరిస్థితులకు అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని అశోక్‌కుమార్ సూచించారు. బంతిపై నియంత్రణ సాధించడం, దాడి చేయడం, బంతిని అందిపుచ్చుకోవడం, సహచరులకు పాస్‌లు ఇవ్వడం వంటి ప్రతి అంశంలోనూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యమన్నారు. హాకీ ఒక జట్టు క్రీడ అని, ఒక్క ఆటగాడి ప్రదర్శనతో విజయం సాధ్యం కాదని చెప్పారు. ప్రతి ఒక్కరి పాత్ర కీలకమేనని, ముఖ్యంగా ఫార్వర్డ్ ఆటగాళ్లు ప్రత్యర్థి డిఫెన్స్ ను ఛేదించేలా అసాధారణ ప్రదర్శన చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
టోక్యో, పారిస్ ఒలింపిక్స్‌లో వరుసగా కాంస్య పతకాలను సాధించిన భారత జట్టు, ప్రపంచ కప్‌లోనూ అదే పోరాట పటిమను ప్రదర్శిస్తే, 51 ఏళ్ల నిరీక్షణకు తెరపడవచ్చనే నమ్మకం ఉంది. ప్రపంచ కప్ అనేది కేవలం మరో టోర్నమెంట్ మాత్రమే కాదు… భారత హాకీ చరిత్రలో ఒక స్వర్ణాధ్యాయాన్ని లిఖించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. 1975లో పాకిస్థాన్‌పై సాధించిన చారిత్రాత్మక విజయం నుండి స్ఫూర్తిని పొంది ప్రస్తుత ఆటగాళ్లు బరిలోకి దిగితే, 51 ఏళ్లుగా నెరవేరని కల సాకారం కావచ్చని గత తరం దిగ్గజాలు పేర్కొంటున్నారు.
51 ఏళ్ల నిరీక్షణ, లక్షలాది మంది అభిమానుల ఆశలు, 1975 నాటి హీరోలు అందించిన స్ఫూర్తి.. ఇవన్నీ హర్మన్‌ప్రీత్ సింగ్ సారథ్యంలోని జట్టు ముందు ఉన్నాయి. సరికొత్త చరిత్రను లిఖిస్తూ ముందుకు సాగాల్సిన సమయం ఇది. ప్రపంచ కప్ వేదికపై భారత జెండా మరోసారి సగర్వంగా రెపరెపలాడాలంటే, ఈసారి కచ్చితంగా పతకం సాధించాల్సిందే!
