నీటి వనరుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
- జలధార–జలహారతి పనులను నిరంతరంగా కొనసాగించాలి: సీఎం చంద్రబాబు
- తాగునీరు, పంటల రక్షణకు ముందస్తు చర్యలు.. 79,826 పనులు పూర్తి
అమరావతి, ఆంధ్రప్రభ : ఎల్‌నినో ప్రభావం అంచనాలకు మించి ఉన్న నేపథ్యంలో నీటి వనరుల పరిరక్షణ, తాగునీటి సరఫరా, పంటల రక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ‘జలధార–జలహారతి’ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహించాలని సూచించారు. శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమం పురోగతిని సమీక్షించారు.
జలధార–జలహారతి కింద రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 82,865 పనులను గుర్తించగా.. రూ.3,409.35 కోట్ల విలువైన పనులు మంజూరైనట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వీటిలో ఇప్పటికే 79,826 పనులు పూర్తయ్యాయి. చెరువుల పునరుద్ధరణ, ఫీడర్ ఛానళ్ల అభివృద్ధి, ఫార్మ్ పాండ్లు, ట్రెంచ్‌ల తవ్వకం తదితర పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టినట్లు తెలిపారు.
రానున్న రోజుల్లో తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో నీటి నిల్వలు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. వెలుగోడు, గోరకల్లు, అవుకు, జీడిపల్లి, చెర్లోపల్లి తదితర రిజర్వాయర్లలో తాగునీటి అవసరాలకు అనుగుణంగా నీటిని నిల్వ చేయాలని ఆదేశించారు.
నాగార్జునసాగర్ కాలువల ద్వారా వివిధ జిల్లాలకు తాగునీటి అవసరాల కోసం నీటి కేటాయింపులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా జిల్లా స్థాయిలో సమగ్ర కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు.
నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని పంటల రక్షణకు అవసరమైన చర్యలు చేపట్టాలని, నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునేలా రైతులకు అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. జలధార–జలహారతి కింద చేపట్టిన పనులను నాణ్యతతో పూర్తి చేసి వాటి ప్రయోజనాలు ప్రజలకు అందేలా చూడాలని ఆదేశించారు.
సమీక్షా సమావేశంలో మంత్రి నిమ్మల రామానాయుడు, నీటిపారుదల, వ్యవసాయ, పంచాయతీరాజ్ శాఖల ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
