భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన !

మాస్కో, ఆంధ్ర‌ప్ర‌భ : భారతదేశంతో రైలు మార్గ అనుసంధానాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని రష్యా పరిశీలిస్తోంది. బోస్ఫరస్ , హోర్ముజ్ జలసంధులపై ఆధారపడటం వల్ల రవాణా, వాణిజ్య రంగాల్లో తలెత్తుతున్న‌ ముప్పులను తగ్గించడానికి హిందూ మహాసముద్రం వరకు రైలు మార్గం అవసరమని రష్యా ఉప ప్రధాని మరాట్ ఖుస్నుల్లిన్ పేర్కొన్నారు. రష్యా వార్తా సంస్థ ‘టాస్’ (TASS)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వివరించారు.

రష్యా నుంచి భారత్‌కు చేరుకునే ప్రత్యామ్నాయ మార్గాలపై పరిశీలన జరపాలని ఖుస్నుల్లిన్‌ సూచించారు. తుర్క్‌మెనిస్థాన్‌, ఇరాన్‌, అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌ మీదుగా హిందూ మహాసముద్రం, భారత్‌కు చేరుకునే మార్గాలను పరిశీలించవచ్చని తెలిపారు. భారత్‌కు అనుసంధానం కల్పించే ఏ ప్రత్యామ్నాయ మార్గమైనా పరిశీలనకు అనుకూలమేనని ఆయన పేర్కొన్నారు.

హార్ముజ్‌ సంక్షోభం నేపథ్యంలో..

హార్ముజ్‌ జలసంధి మీదుగా జరిగే రవాణాపై భద్రతాపరమైన ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో రష్యా ఈ ప్రతిపాదన తెరపైకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సముద్ర మార్గాల్లో అంతరాయాలు ఏర్పడినప్పుడు సరకు రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నది రష్యా ఆలోచనగా కనిపిస్తోంది.

ఇప్పటికే రష్యా-భారత్‌ మధ్య భూ, రైలు మార్గాల ద్వారా సరకు రవాణాను పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. తుర్క్‌మెనిస్థాన్‌, ఇరాన్‌ మీదుగా సాగే అంతర్జాతీయ ఉత్తర-దక్షిణ రవాణా మార్గంలోని తూర్పు శాఖ ద్వారా రష్యా నుంచి భారత్‌కు సరకు రవాణా జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఈ మార్గంలో ఇప్పటికే వాణిజ్య రవాణా సేవలు నిర్వహిస్తున్నట్లు తాజా అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

భారత్‌కు వ్యూహాత్మక ప్రాధాన్యం

రష్యా ప్రతిపాదన అమల్లోకి వస్తే భారత్‌కు కూడా వ్యూహాత్మకంగా ప్రాధాన్యత కలిగే అవకాశం ఉంది. సముద్ర రవాణా మార్గాలపై ఆధారపడటాన్ని కొంత మేర తగ్గించడంతో పాటు యూరప్‌, రష్యా, మధ్య ఆసియా ప్రాంతాల నుంచి భారత్‌కు సరకు రవాణాకు మరిన్ని ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి రావచ్చు.

అయితే ఇది ప్రస్తుతం రష్యా ఉప ప్రధాని ప్రతిపాదించిన మార్గాల అన్వేషణ స్థాయిలోనే ఉంది. కొత్త రైల్వే మార్గాన్ని నిర్మించేందుకు ఎలాంటి తుది ఒప్పందం లేదా నిర్మాణ ప్రణాళికను రష్యా ప్రకటించలేదు. మార్గం, వ్యయం, భద్రత, ఆయా దేశాల మధ్య సమన్వయం వంటి అనేక అంశాలపై భవిష్యత్తులో నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.