ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
విజయవాడ సెంట్రల్, ఆంధ్రప్రభ : ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తున్నామని ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. కాలవ ప్రాంత ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. కోతులు, పాముల బెడదను నివారించేందుకు చర్యలు చేపడతామని, వాకింగ్ ట్రాక్, ధోబీఘాట్ అభివృద్ధికి ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 25వ డివిజన్లో అల్లూరి సీతారామరాజు వంతెన నుంచి కాలవ ఒడ్డు మీదుగా ఓల్డ్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ రోడ్డు వరకు శనివారం ‘రెండేళ్ల నమ్మకం.. సంక్షేమం, అభివృద్ధి’ పేరుతో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఇంటింటికీ వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 21 డివిజన్లలో టీడీపీ శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకుంటున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం గత 24 నెలల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందన్నారు.
కాలవ ప్రాంతంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని బొండా ఉమ తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడతామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మహిళా నాయకురాలు మాచర్ల పావని, డివిజన్ అధ్యక్షుడు మాచర్ల గోపినాథ్, ప్రధాన కార్యదర్శి ఇనుకుల సాయిబాబు, ఇన్చార్జి సుబ్బారావు, క్లస్టర్ ఇన్చార్జి తుమ్మల పెంట శ్రీనివాస్, విజయకృష్ణ సూపర్ బజార్ డైరెక్టర్ దొంగర ఆంజనేయులు, ప్రవీణ్ జైన్, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
