కిటకిటలాడిన ఇంద్రకీలాద్రి..

  • 53,772 మందికి అమ్మవారి దర్శనం..
  • రూ.2.60 లక్షల విరాళాలు
  • అంతరాలయ, వీఐపీ దర్శనాలకు తాత్కాలిక విరామం..
  • సామాన్య భక్తులకు వేగవంతమైన దర్శనం
  • దసరా మహోత్సవాలకు ఇప్పటి నుంచే సన్నాహాలు..
  • అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి ఆనం
  • శ్రావణంలో నూతన ప్రసాదం పోటు, అన్నప్రసాద భవనాల ప్రారంభానికి ఏర్పాట్లు
  • ‘ధర్మపథం’లో కూచిపూడి నృత్య వైభవం..
  • హైదరాబాద్ మహంకాళి ఆలయాలకు కనకదుర్గమ్మ పట్టు వస్త్రాలు

(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై శుక్రవారం భక్తజనం పోటెత్తారు. ఉదయం 11 గంటల తర్వాత అమ్మవారి దర్శనానికి భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడమే లక్ష్యంగా దేవస్థానం యంత్రాంగం కీలక నిర్ణయాలు తీసుకుని రద్దీని సమర్థంగా నియంత్రించింది. రద్దీ అధికంగా ఉన్న సమయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనాలకు విరామం కల్పించారు. దీంతో సామాన్య భక్తుల దర్శనానికి ప్రాధాన్యం లభించింది.

ఒక్కరోజే 53,772 మందికి దర్శనం..

దేవస్థానం గణాంకాల ప్రకారం ఆగస్టు 7న మొత్తం 53,772 మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు 92,563 ప్రసాద ప్యాకెట్లు అందించారు. వివిధ సేవల ద్వారా 455 మంది భక్తులు పాల్గొనగా, 1,906 మంది కేశఖండన చేయించుకున్నారు. అన్నప్రసాదాన్ని 11,020 మంది స్వీకరించారు. దేవస్థానానికి భక్తుల నుంచి రూ.2,60,076 విరాళాలు లభించాయి. రద్దీ నేపథ్యంలో క్యూలైన్లలో భక్తులకు తాగునీరు అందించడంతో పాటు ఉచిత ప్రసాదం, అన్నప్రసాదం అందుబాటులో ఉంచారు. వైర్‌లెస్ వ్యవస్థ, సీసీ కెమెరాల ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ క్యూలైన్ల నిర్వహణ, భద్రత, భక్తుల రాకపోకలను సమన్వయం చేశారు.

దసరాకు ఇప్పటి నుంచే కసరత్తు..

ఇదే సమయంలో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంద్రకీలాద్రిని సందర్శించి కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొండపై జరుగుతున్న అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కాలిబాటలు, క్యూలైన్లు, ఇతర మౌలిక సదుపాయాల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయ మాస్టర్ ప్లాన్‌లోని పనులను నిర్ణీత గడువులోగా నాణ్యతతో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

రానున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాలను రాష్ట్ర ప్రతిష్ఠకు తగ్గట్టుగా అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ముందస్తు ప్రణాళికతో సిద్ధం కావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున దర్శనాలు, క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, భద్రత, ట్రాఫిక్, పార్కింగ్, షటిల్ సర్వీసులు, అత్యవసర సేవలపై అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ముఖ్యంగా సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దర్శన ఏర్పాట్లు ఉండాలని స్పష్టం చేశారు.

శ్రావణంలో కొత్త ప్రసాదం పోటు.. అన్నప్రసాద భవనం..

భక్తులకు మరింత నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించేందుకు నిర్మించిన నూతన ప్రసాదం పోటు, అన్నప్రసాద భవనాల ప్రారంభోత్సవానికి దేవస్థానం సన్నాహాలు ముమ్మరం చేసింది. శ్రావణ మాసం తొలి లేదా రెండో వారంలో వీటిని భక్తుల సేవకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనులు సాగుతున్నాయి. ఈవో వి.కె. శీనా నాయక్ అధ్యక్షతన ప్రత్యేక సమీక్ష నిర్వహించి ప్రారంభోత్సవ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.

దేవాదాయ శాఖ నుంచి అధికారిక ఉత్తర్వులు వచ్చిన అనంతరం వేద పండితులు నిర్ణయించే ముహూర్తం ప్రకారం ప్రారంభోత్సవ తేదీ ఖరారు చేస్తామని తెలిపారు. ప్రసాదం తయారీ, యంత్రాల పనితీరు, విద్యుదీకరణ, మౌలిక సదుపాయాలు, అన్నప్రసాద పంపిణీ తదితర అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా ఇంజినీరింగ్, ప్రసాదం, అన్నప్రసాద విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఈవో ఆదేశించారు. నూతన భవనాలు అందుబాటులోకి వస్తే ప్రసాదాల తయారీ సామర్థ్యం పెరగడంతో పాటు భక్తులకు పరిశుభ్రమైన, నాణ్యమైన సేవలు మరింత వేగంగా అందే అవకాశం ఉంది.

‘ధర్మపథం’లో కూచిపూడి వైభవం..

ఇంద్రకీలాద్రిపై భక్తి, సంస్కృతి, సంప్రదాయాలను సమన్వయం చేస్తూ నిర్వహిస్తున్న ‘ధర్మపథం’ సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రాజగోపురం కళావేదికపై కూచిపూడి నృత్య ప్రదర్శన నిర్వహించారు. బి. స్వర్ణలత నేతృత్వంలోని బృందం భక్తి కీర్తనలకు శాస్త్రీయ నృత్యాభినయంతో ప్రాణం పోసింది. ‘మూషిక వాహన’, ‘జయ జయ’, ‘చక్కని తల్లి’, ‘అంతా రామమయం’, ‘ముద్దుగారే యశోద’, ‘తాండవకృష్ణ’, ‘పలుకే బంగారమాయెనా’ తదితర భక్తి గీతాలకు ప్రదర్శించిన నృత్యాలు భక్తులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమం అనంతరం కళాకారులను దేవస్థానం అధికారులు సత్కరించారు.

భాగ్యనగర బోనాలకు కనకదుర్గమ్మ పట్టు వస్త్రాలు…

తెలంగాణలో జరుగుతున్న బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రముఖ మహంకాళి ఆలయాలకు ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధి నుంచి పట్టు వస్త్రాలను సమర్పించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) ఆధ్వర్యంలో దేవస్థాన బృందం ఉప్పుగూడ, లాల్‌దర్వాజా, గౌలిపురా, సుల్తాన్‌షాహి, హరిబౌలి, మీర్‌ఆలంమండి ప్రాంతాల్లోని మహంకాళి ఆలయాలకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజల సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చైర్మన్ గాంధీ తెలిపారు. ఈ సంప్రదాయం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు.