ప్రజాధనంపై సమగ్ర విచారణకు డిమాండ్‌

డీజిల్‌ వ్యవహారంపై లెక్కలేంటి
సులభ్‌ కాంప్లెక్స్‌ అద్దె ఎవరి జేబులోకి..?

ఖమ్మం, ఆంధ్రప్రభ : ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అవినీతి, అక్రమాలపై బీఆర్‌ఎస్‌ మాజీ కార్పొరేటర్‌ బిక్కసాని ప్రశాంతి లక్ష్మి ప్రశ్నల వర్షం కురిపించారు. శనివారం స్థానికంగా బిక్కసాని ప్రశాంతి లక్ష్మి ”ఆంధ్రప్రభ”తో మాట్లాడుతూ కార్పొరేషన్‌ వాహనాలకు కేటాయిస్తున్న డీజిల్‌ వినియోగంపై పూర్తిస్థాయి వివరాలు బయటపెట్టాలని డిమాండ్‌ చేశారు. గతంలో సబ్‌జైలు బంక్‌ నుంచి డీజిల్‌ కొట్టించిన వ్యవహారం ఉండగా.. ప్రస్తుతం ప్రముఖ కాంగ్రెస్‌ నాయకుడికి చెందిన బంక్‌లోనే డీజిల్‌ ఎందుకు కొట్టిస్తున్నారో అధికారులు స్పష్టం చేయాలని ప్రశ్నించారు. వాహనాల వినియోగం, డీజిల్‌ బిల్లులు, కేటాయింపులు, వాస్తవ వినియోగంపై సమగ్రంగా విచారణ జరిపితే అసలు విషయం బయటపడుతుందని ఆమె పేర్కొన్నారు.

కార్పొరేషన్‌ పరిధిలోని సులభ్‌ కాంప్లెక్స్‌ల నిర్వహణ, అద్దె వసూళ్లపైనా ప్రశాంతి లక్ష్మి నిలదీశారు. సులభ్‌ కాంప్లెక్స్‌లను ఎవరికి కేటాయించారు..? అద్దె ఎంత వసూలు చేస్తున్నారు..? ఆ మొత్తాన్ని ఎవరు చెల్లిస్తున్నారు..? కార్పొరేషన్‌ ఖాతాలో ఎంత జమ చేస్తున్నారు..? అనే వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్‌ చేశారు. గతంలో పారదర్శకంగా నిర్వహించిన ప్రజా సౌకర్యాల వ్యవస్థ ప్రస్తుతం ఎవరికి అనుకూలంగా మారిందో తేల్చాలని కోరారు. ప్రజా ఆస్తులు, సౌకర్యాల ద్వారా వచ్చే ఆదాయంపై పూర్తి లెక్కలు వెల్లడించాలని అన్నారు. ఈ వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించినట్లు- తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కార్పొరేషన్‌లో ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలని ప్రశాంతి లక్ష్మి కోరారు. డీజిల్‌ వ్యవహారం, సులభ్‌ కాంప్లెక్స్‌ల అద్దెలతోపాటు- ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, అక్రమ నిర్మాణాలు, పారిశుద్ధం, తాగునీరు, రోడ్లు, వీధి దీపాల నిర్వహణపై కూడా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. ఆరోపణలపై వాస్తవాలను అధికారులు ప్రజల ముందు ఉంచాలని అన్నారు. ప్రభుత్వ నిధులు, కార్పొరేషన్‌ ఆస్తుల విషయంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజా సమస్యలను విస్మరిస్తే భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌ తరఫున మరింత ఉధృతంగా ఉద్యమిస్తామని ప్రశాంతి లక్ష్మి హెచ్చరించారు.