ఇంద్రకీలాద్రిపై భక్తజన సందోహం..

  • వారాంతపు సెలవులు,ఆషాఢ సారెతో పండుగ వాతావరణం
  • 65 వేల మందికి పైగా అమ్మవారి దర్శనం..
  • సామాన్య భక్తులకే పెద్దపీట వేసిన అధికారులు
  • అన్ని క్యూలైన్లు ఉచిత దర్శనాలుగా మార్పు..
  • వీఐపీ, అంతరాలయ దర్శనాలు రద్దు

(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : రెండో శనివారం సెలవు, ఆషాఢ మాస ఉత్సవాల నేపథ్యంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపై శనివారం భక్తజనం పోటెత్తారు. ఉదయం 6 గంటల నుంచే ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. ఘాట్‌రోడ్‌, శ్రీ కనకదుర్గ నగర్‌ మార్గాల మీదుగా భక్తులు పెద్ద సంఖ్యలో కొండపైకి తరలివచ్చారు. శనివారం 70 వేల మందికి పైగా భక్తులు శ్రీ దుర్గమ్మవారిని దర్శించుకున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు.

పటిష్ట ఏర్పాట్లు…

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సామాన్య భక్తులకు వీలైనంత త్వరగా దర్శనం కల్పించేందుకు దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈవో వి.కె. శీనా నాయక్‌ ఆధ్వర్యంలో ఆలయ యంత్రాంగం, వన్‌టౌన్‌ పోలీసులు సమన్వయంతో రద్దీ నియంత్రణ, భద్రతా చర్యలు చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేయడంతో పాటు ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అన్ని రకాల దర్శన టికెట్లను నిలిపివేసి, అన్ని క్యూలైన్లను ఉచిత దర్శన మార్గాలుగా మార్చారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వీఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపివేశారు.

ఎండ తీవ్రత దృష్ట్యా క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు సంచార నీటి డబ్బాల ద్వారా చల్లని తాగునీటిని అందించారు. చంటిబిడ్డల తల్లులు, వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్‌ ద్వారా దర్శనం కల్పించారు. భక్తుల రద్దీ మధ్య కుటుంబ సభ్యుల నుంచి తప్పిపోయిన ఓ వృద్ధురాలిని ఈవో శీనా నాయక్‌ గుర్తించి, మైక్‌ ద్వారా ప్రకటన చేయించి ఆమె కుటుంబ సభ్యుల చెంతకు చేర్చారు. దీంతో భక్తుల సౌకర్యం, భద్రతకు దేవస్థానం తీసుకున్న చర్యలు ప్రశంసలు అందుకున్నాయి.