ప్రస్తుత వర్షాభావ పరిస్థితులపై అవగాహన సదస్సులు..
నంద్యాల రూరల్, ఆగస్టు 8 (ఆంధ్ర ప్రభ) : ఆచార్య ఎన్. జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఆధ్వర్యంలో ప్రస్తుత వర్షాభావ పరిస్థితులపై అవగాహన సదస్సులు శనివారం నిర్వహించారు.
నంద్యాల మండలం పులిమద్ది, రాయమాల్పురం, భీమవరం గ్రామాల్లో నిర్వహించిన అవగాహన సదస్సులో వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ వాతావరణ మార్పులకు ప్రతిబింబించే విధంగా ప్రస్తుతం ఎల్నీనో ప్రభావం ఉందని, ఈ పరిస్థితులలో రైతు సోదరులు సాంప్రదాయంగా సాగు చేస్తున్నటువంటి అధిక నీటి అవసరం ఉన్నటువంటి పంటలు సాగు చేసినట్లయితే ముందు ముందు రోజుల్లో వర్షాభావ పరిస్థితుల వలన దిగుబడులు గణనీయంగా తగ్గడమే కాక పంట నష్టం కూడా జరగడానికి అవకాశం ఉందన్నారు. ఈ పరిస్థితులు ఎదుర్కొనేందుకు తక్కువ నీటి అవసరమున్నటువంటి తక్కువ పంట కాలం ఉన్నటువంటి పంటలు అంటే మినుము కొర్ర, సజ్జ, జొన్న వంటి పంటలను ఆయా నెలలకు అనుకూలంగా పంటల ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.
అదేవిధంగా ప్రస్తుతం సాగులో ఉన్నటువంటి పంటలు వివిధ దశల్లో ఉన్నటువంటి పంటలలో నేలలో తక్కువ తేమ ఉన్నటువంటి పరిస్థితులలో పంటకు పోషకాలను పైపాటుగా పిచికారి చేసి అందించినట్లయితే పెట్ట పరిస్థితుల ప్రతికూల ప్రభావాన్ని కొంతవరకు తగ్గించవచ్చని చెప్పారు అదేవిధంగా నీటిపారుదల కింద సాగు చేస్తున్నటువంటి పంటలలో నీటిని ఆదా చేయుటకు సమర్థవంతమైన నీటిపారుదల పద్ధతులు పాటించాలన్నారు. అందుకు ప్రతిసారికు నీళ్లు పెట్టే కన్నా సాలు మార్చి సాలు పెట్టినట్లయితే నీటి వినియోగశాతం పెరుగుతుందని అదేవిధంగా అవకాశం ఉన్నచోట డ్రిప్, స్ప్రిం క్లర్ల పద్ధతిలో పద్ధతిలో పంటలకు నీటిని అందించినట్లయితే తక్కువ నీటి లభ్యత సమస్యను అధిగమించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహానంది వ్యవసాయ కళాశాల ప్రొపెసర్ డాక్టర్ కే. ప్రభాకర్, డాక్టర్ కే. అశోక్ కుమార్, డాక్టర్ బి.రవి ప్రకాష్ రెడ్డి, డాక్టర్ పులి బాయ్ ఆయా గ్రామ రైతులు పాల్గొన్నారు.
