9 తులాల బంగారం, 80 తులాల వెండి, రూ. 2 లక్షల నగదు అపహరణ.

​రావల్ కోల్ పట్టణంలో దొంగల హల్ చల్.

కన్నీరుమున్నీరవుతున్న బాధితులు​ఇంటికి తాళం వేసి వెళ్లడమే ఆలస్యం..
చొరబడి దోచేసిన దుండగులు….


​మేడ్చల్, ఆంధ్రప్రభ : ​మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రావల్ కోల్ పట్టణంలో శనివారం రోజు భారీ చోరీ చోటుచేసుకుంది. రావల్ కోల్ పట్టణానికి చెందిన బందెల ముత్యాలు కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లిన సమయంలో దుండగులు ఈ ఘాతుకానికి ఒడిగట్టారు.
​ఇంటికి తాళం వేసి ఉన్న విషయాన్ని గమనించిన దొంగలు, తలుపులు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బెడ్‌రూమ్‌లోని అల్మారాలను, లాకర్లను ధ్వంసం చేసి లోపల ఉన్న నగదు, బంగారు ఆభరణాలను దొంగిలించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇంట్లో దాచి ఉంచిన 9 తులాల బంగారం, 80 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ. 2 లక్షల నగదును దుండగులు అపహరించుకుపోయారు.
​తిరిగి వచ్చి చూసేసరికి ఇంటి తలుపుల తాళాలు పగులగొట్టి ఉండటం, అల్మారిలోని బట్టలు, వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండటంతో బాధితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సర్వస్వం కోల్పోయామని కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ సాయంతో దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.