వ్యవస్థాపగత మార్పు కోసమే పాదయాత్ర…
ప్రజలందరికీ ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలి
భావ ప్రకటన స్వేచ్ఛ సమాజం కావాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి
తిరుపతి సిటీ, ఆగస్టు 8 (ఆంధ్రప్రభ):కేవలం అధికార మార్పిడి లేదా నాయకుల మార్పుతో సమాజంలో మార్పు రాదని, ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం, గృహవసతి, తాగునీరుతో పాటు భావ ప్రకటన స్వేచ్ఛను కల్పించే వ్యవస్థాపగత మార్పు కోసమే సీపీఐ పాదయాత్ర నిర్వహిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పుట్టా హరినాథరెడ్డి అన్నారు.
తిరుపతి నగరంలోని కృష్ణారెడ్డి కాలనీలో శనివారం ‘మార్పు’ కోసం పాదయాత్ర ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరినాథరెడ్డి మాట్లాడుతూ 1980వ దశకంలో తిరుపతిలో వీధి రౌడీలు, విశ్వవిద్యాలయంలో కుల రాజకీయాలు రాజ్యమేలేవని గుర్తుచేశారు. ఆనాడు కమ్యూనిస్టు పార్టీ విద్యార్థి, యువజన సంఘాల ద్వారా పోరాడి రౌడీయిజాన్ని తుదముట్టించి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పిందన్నారు.
అంతేకాకుండా, పేదల కోసం ప్రభుత్వ భూములను పరిరక్షించి వేలాది మందికి ఆశ్రయం కల్పించిన చరిత్ర సీపీఐకి ఉందన్నారు. ప్రస్తుతం తిరుపతిలో గంజాయి ముఠాలు, భూకబ్జాలు, పొలిటికల్ రౌడీయిజం మళ్లీ పెరిగిపోవడం విచారకరమని ఆందోళన వ్యక్తం చేశారు. గత వైసీపీ, నేటి కూటమి ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని విస్మరించి, వ్యవస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చామని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే తిరుపతి ప్రజలు, మేధావులు గతంలోలాగే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
రెవెన్యూ, పోలీస్ పరిపాలనా విభాగాలు ప్రజా సంక్షేమం కోసం నిష్పాక్షికంగా పనిచేయాలని డిమాండ్ చేశారు. పరిస్థితి మారకపోతే బాధితులు, వ్యాపారులు, మేధావులను సమీకరించి ఇంటింటికీ వెళ్లి దురాగతాలను ఎండగడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి. మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, నదియా, బండి చలపతి, నగర కార్యదర్శి విశ్వనాథ్, ప్రజా సంఘాల నాయకులు రామకృష్ణ, శివ, బాబు, ప్రవీణ్, ఓం రాజ్, కాలయ్య, రామచంద్రయ్య, గోవింద స్వామి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
