శాంతియుతంగా పరిష్కరించుకోవాలి
పోడు భూముల సమస్యలపై నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా
కడెం, ఆగస్టు 8 (ఆంధ్రప్రభ): పోడు భూములకు సంబంధించిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి శాంతియుతంగా పరిష్కరించుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల సూచించారు. అటవీ శాఖ అధికారులు, గ్రామస్తులు పరస్పరం సంయమనం పాటిస్తూ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు.
కడెం మండలంలోని ఉడుంపూర్, గంగాపూర్, రాణిగూడ, కొర్రతండా, అల్లంపల్లి, బాబానాయక్‌తండా గ్రామాల పరిధిలోని పోడు భూములు, అటవీ శాఖకు సంబంధించిన సమస్యలపై అధికారులు, గ్రామ ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులతో చర్చలు నిర్వహించారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచనల మేరకు జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఆధ్వర్యంలో సంబంధిత అధికారులు గ్రామస్తులతో సమావేశమై సమస్యలను తెలుసుకున్నారు. నిర్మల్ డీఎఫ్‌ఓ సుశాంత్ సుఖదేవ్ బొబడే, అదనపు కలెక్టర్లు కిషోర్‌కుమార్, వెంకటేశ్వర్లు, డీఆర్‌డీవో విజయలక్ష్మి, ఆర్డీవో దేవదాస్, డీఎస్పీ శ్రీనివాస్, తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, ఖానాపూర్ సీఐ సత్యనారాయణ, కడెం ఎస్‌ఐ సాయికిరణ్ తదితరులు చర్చల్లో పాల్గొన్నారు.
సమస్యలను చర్చలతో పరిష్కరించాలి
ఈ సందర్భంగా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ.. గ్రామాల్లోని సమస్యలను సమగ్రంగా పరిశీలించి పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిన్నచిన్న సమస్యలను అటవీ శాఖ అధికారులు, గ్రామపంచాయతీ సమక్షంలోనే పరిష్కరించుకోవాలని సూచించారు. పెద్ద సమస్యలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
అటవీ శాఖ అధికారులు, గ్రామ ప్రజలు పరస్పరం గొడవలకు వెళ్లకుండా సంయమనంతో వ్యవహరించాలని సూచించారు. సమస్యలను శాంతియుత వాతావరణంలో చర్చించుకోవడం ద్వారా పరిష్కార మార్గాలను కనుగొనాలని కోరారు.
సహాయ నిరాకరణ విరమణ
అధికారులతో జరిగిన చర్చల అనంతరం గ్రామస్తులు సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని విరమించుకుని, యథావిధిగా బేస్‌క్యాంప్ వాచర్లు తమ విధులకు హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో కళ్లెడ సర్పంచ్ టి. రుక్మిణీదేవి, సంజీవ్ పటేల్, ఉడుంపూర్ ఉపసర్పంచ్ సరిత ప్రభాకర్, వార్డు సభ్యులు కన్నయ్య, రవీందర్, గంగాపూర్ సర్పంచ్ జంగు పటేల్, రాణిగూడ సర్పంచ్ తొడసం సీతారాం, కొర్రతండా సర్పంచ్ విజయలక్ష్మి, దాసు నాయక్, అల్లంపల్లి సర్పంచ్ కాంత నరేష్, బాబానాయక్‌తండా సర్పంచ్ సునీత, మాధవ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు జొన్నాల చంద్రశేఖర్‌గుప్తా మాట్లాడుతూ.. అటవీ శాఖ అధికారులు, గ్రామ ప్రజలు పరస్పరం సంయమనం పాటిస్తూ శాంతియుత వాతావరణంలో సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకోవాలని కోరారు.
