శిథిలావస్థలో ప్రభుత్వ కార్యాలయాలు
పెచ్చులు రాలుతున్న భవనాలు..
భయాందోళనలో అధికారులు, సిబ్బంది
మరిపెడ, ఆంధ్రప్రభ : మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో అధికారులు, సిబ్బంది భయాందోళన మధ్య విధులు నిర్వహిస్తున్నారు. ఏళ్ల కిందట నిర్మించిన ట్రెజరీ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, ఎమ్మార్వో కార్యాలయంతో పాటు మరిపెడ మున్సిపాలిటీ కార్యాలయ భవనాలు ప్రస్తుతం అధ్వానంగా మారాయి.
భవనాల పైకప్పు నుంచి స్లాబ్ పెచ్చులు రాలిపడుతున్నాయి. పలుచోట్ల పగుళ్లు ఏర్పడి, వర్షపు నీరు లోపలికి చేరుతోంది. మున్సిపాలిటీ కార్యాలయంలో విద్యుత్ సరఫరా ఉండటంతో నీరు చేరిన సమయంలో ప్రమాదం పొంచి ఉందని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పుడు కూలుతాయోనని ఆందోళన
శిథిలావస్థకు చేరిన భవనాల్లో పనిచేయడం ఇబ్బందిగా ఉందని అధికారులు, సిబ్బంది చెబుతున్నారు. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనన్న భయం వెంటాడుతోందని పేర్కొంటున్నారు.
ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ కార్యాలయ భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిబ్బంది, ప్రజలు కోరుతున్నారు.
