వర్షాకాలంలో పాము కాటుపై అప్రమత్తత అవసరం
అన్ని పీహెచ్‌సీల్లో పాము కాటు నివారణ ఇంజెక్షన్లు అందుబాటులో
ఖమ్మం, ఆంధ్రప్రభ : వర్షాకాలంలో పాములు, ఇతర విషకీటకాలు తమ నివాసాల నుంచి బయటకు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి రామారావు సూచించారు. ముఖ్యంగా రైతులు, వ్యవసాయ కూలీలు పాము కాటు పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ సర్వజన వైద్యశాలల్లో పాము కాటుకు సంబంధించిన నిరోధక ఇంజెక్షన్లు తగినంతగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
రైతులు, వ్యవసాయ కూలీలు పొలాల్లో పనులు చేసేటప్పుడు కాళ్లకు ఎత్తైన బూట్లు, చేతులకు తొడుగులు ధరించాలని సూచించారు. చీకటి వేళల్లో లేదా రాత్రి సమయంలో పొలాలు, బావుల వద్దకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా టార్చ్ లైట్ వెంట తీసుకెళ్లాలని తెలిపారు.
దట్టమైన గడ్డి, చెత్తాచెదారం, పొదలు ఉన్న ప్రాంతాల్లో నడిచేటప్పుడు కర్రతో నేలను తడుతూ శబ్దం చేస్తూ ముందుకు సాగాలని సూచించారు. రాతి గుట్టలు, చెట్ల తొర్రలు, బొరియలు, పాత సామగ్రి ఉన్న ప్రాంతాల్లో ఆలోచించకుండా చేతులు పెట్టవద్దని హెచ్చరించారు.
ఇళ్ల పరిసరాల్లో పిచ్చి మొక్కలు, పొదలు, చెత్తాచెదారాన్ని ఎప్పటికప్పుడు తొలగించి పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ధాన్యం నిల్వలు ఉన్న ప్రాంతాల్లో ఎలుకలు చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎలుకల కోసం పాములు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.
పాము కాటుకు గురైన వ్యక్తిని భయాందోళనకు గురికాకుండా ధైర్యం చెప్పాలని, కాటు వేసిన చేయి లేదా కాలును ఎక్కువగా కదల్చకుండా నిశ్చలంగా ఉంచాలని సూచించారు. మంత్రాలు, మూలికలు, నాటు వైద్యంపై ఆధారపడి సమయాన్ని వృథా చేయవద్దన్నారు.
కాటు వేసిన చోట కోతలు పెట్టడం, నోటితో విషాన్ని పీల్చడం, రక్త ప్రసరణ ఆగిపోయేలా గట్టిగా కట్టు కట్టడం వంటివి చేయకూడదని స్పష్టం చేశారు. బాధితుడిని వీలైనంత త్వరగా సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి లేదా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించాలని సూచించారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాము కాటుకు అవసరమైన ఉచిత వైద్యం, మందులు నిరంతరం అందుబాటులో ఉంటాయని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి రామారావు తెలిపారు. ప్రజలు ఈ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
