ఉషాజ్యోతి హైస్కూల్లో ఘనంగా బోనాల వేడుకలు
కమ్మర్పల్లి, ఆంధ్రప్రభ: కమ్మర్పల్లి మండల కేంద్రంలోని ఉషాజ్యోతి హైస్కూల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల పండుగను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల కరస్పాండెంట్ గిరిబాబు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. ప్రధానోపాధ్యాయుడు వి. అన్వేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో విద్యార్థినులు సంప్రదాయ దుస్తుల్లో శిఖర బోనాలు ఎత్తుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోతురాజు విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, విద్యార్థుల జానపద నృత్యాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేయడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలకమని అన్నారు. ప్రధానోపాధ్యాయుడు వి. అన్వేష్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు సంస్కృతి, విలువలను నేర్పించడం పాఠశాల లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రశాంత్, నిరోష, శ్రవంతి, సౌందర్య, సుమలత, వీణ, వినిత, నికిత, రజిత, హంస తదితరులు పాల్గొన్నారు.
