ఉద్యమకారుల హామీలు అమలు చేయాలి

టేకుమట్ల, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ప్రభుత్వాన్ని కోరింది.

మంగళవారం టేకుమట్ల మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు బొడ్డు తిరుపతి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేకే కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 17లోపు అర్హులైన తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి, ఎన్నికల హామీలైన నెలకు ₹25 వేల గౌరవ వేతనం, 250 గజాల ఇంటి స్థలం, హెల్త్ కార్డులను అందజేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిటీ ప్రక్రియను కాలయాపన చేయకుండా వేగవంతం చేసి ఉద్యమకారులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు బొడ్డు తిరుపతి, జిల్లా నాయకులు కత్తి సంపత్, మండల గౌరవ అధ్యక్షులు నేరెళ్ల రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి సాద మహేందర్, ఉపాధ్యక్షులు అభిరాజ్, జక్కుల కిరణ్, మూడెత్తుల రాజయ్య, గంధం కృష్ణస్వామి, గజ్జి రాజయ్య, పింగిలి రాజిరెడ్డి తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు.