ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలి
పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీలో ఎస్పీ మహేష్ బి. గీతే ఆదేశాలు
వేములవాడ, ఆంధ్రప్రభ : ప్రజలతో మర్యాదగా, బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ విధులు నిర్వర్తించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే పోలీసు అధికారులకు సూచించారు.
మంగళవారం వేములవాడ టౌన్ పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన, స్టేషన్లోని వివిధ రికార్డులు, కేసుల నిర్వహణ తీరు, పరిపాలనా విధానాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించే సమయంలో పిటిషన్దారులతో మర్యాదపూర్వకంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరితో సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తూ, ప్రజలకు సత్వర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎండింగ్లో ఉన్న కేసులను వేగవంతంగా విచారించి, చట్టపరమైన ప్రక్రియ పూర్తి చేసి త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కేసుల దర్యాప్తులో నాణ్యతతో పాటు సమయపాలనకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
ఈ తనిఖీలో వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్, ఎస్సైతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
