మోకాళ్లపై లేఖర్ల నిరసన!

9 రోజులుగా పెన్ డౌన్.. జీవో 396 రద్దుకు డిమాండ్

నర్సాపురం, ఆంధ్రప్రభ: దస్తావేజు లేఖర్లు వృత్తికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మోకాళ్ళడ్డు గా తయారయ్యాయని లేఖర్లు మండి పడుతున్నారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నిరసన శిబిరం వద్ద మంగళవారం మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా లేఖర్లు చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమం నేటితో తొమ్మిదవ రోజుకు చేరిందన్నారు. అయినా ప్రభుత్వంలో ఏ మాత్రం చలనం రాలేదని, రానున్న రోజుల్లో లేఖర్లు కుటుంబాలకు సమాధానం చెప్పుకునే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి వస్తుందన్నారు. ఓటేసిన పాపానికి జీవనభృతి లేకుండా చేస్తారా అంటూ నిలదీశారు.

రాష్ట్ర వ్యాప్తంగా లేఖర్లు రోడ్డు మీదకు వచ్చి తమ ఆవేదన వెళ్లగక్కుతున్న ఇప్పటి వరకూ ఉప ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడక పోవడం చాలా బాధాకరం అన్నారు. బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న దస్తావేజుల లేఖర్లు వల్ల ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదని, అయినప్పటికీ కక్ష పూరితంగా ఈ వృత్తి ను నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నిందని వాపోయారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించు కోకపోతే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.

లేఖర్లు వృత్తికి వ్యతిరేకంగా జారీ చేసిన జీవో 396ను రద్దు చేయాలని , ఆర్ఎస్ కే ల ఏర్పాటు ను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో తెల్గంశెట్టి సత్యనారాయణ, కోయ చింతారావు, దిడ్ల నాగరాజు, వాసా ఈశ్వరరావు, కొప్పాడి శ్రీనివాస్, టి వి రమణ, జి రవి రామారావు, కే రామ చంద్రరావు, మోహన్, శ్రీరామమూర్తి, విజయలక్ష్మి, రత్నకుమారి, సాయి, సత్య నారాయణ, చంటి, మురళీ కృష్ణ, రాజు, పి. రాజు, రవి, బాబ్జీ, సత్య కృష్ణ, రమేష్, మూర్తి తదితరులు పాల్గొన్నారు.