కొల్పూరు–కుర్తికొండ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీపై కీలక చర్చలు

మక్తల్, ఆంధ్రప్రభ: తెలంగాణ పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి మంగళవారం కర్ణాటకలోని రాయచూరులో ఆ రాష్ట్ర మాజీ మంత్రి బోసురాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ–కర్ణాటక సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి కీలకమైన కొల్పూరు–కుర్తికొండ బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మాణంపై ఇరువురు నేతలు విస్తృతంగా చర్చించారు.

కృష్ణా నదిపై ప్రతిపాదిత బ్రిడ్జ్ కమ్ బ్యారేజీ నిర్మాణం పూర్తయితే రెండు రాష్ట్రాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు సాగు, తాగునీటి అవసరాలకు కూడా ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్టును పరస్పర సహకారంతో వీలైనంత త్వరగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు ఆనంద్ గౌడ్, రాజప్ప గౌడ్, విజయ్ గౌడ్, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.