తృటిలో తప్పిన పెను ప్రమాదం
జగిత్యాల, ఆంధ్రప్రభ: జగిత్యాల పట్టణంలోని పికప్ పాయింట్ సమీపంలోని కాంతిభవన్ చౌరస్తాలో సోమవారం ఉదయం పెను ప్రమాదం తృటిలో తప్పింది. విద్యార్థులతో వెళ్తున్న ఓ ప్రైవేటు పాఠశాల బస్సును రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో పాఠశాల బస్సు స్వల్పంగా దెబ్బతినగా, విద్యార్థులెవరూ గాయపడకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఘటనాస్థలికి చేరుకుని పిల్లల క్షేమాన్ని తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రమాదానికి గల కారణాలపై ట్రాఫిక్ పోలీసులు విచారణ చేపట్టారు. ప్రమాదం కారణంగా కొంతసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
