ఏలూరు ప్రజలకు గుడ్ న్యూస్..

  • నేటి నుండి పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరా
  • నీటిని వృథా చేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి


ఏలూరు కార్పొరేషన్, జులై 28 (ఆంధ్రప్రభ): నీటి నిల్వలు తగ్గడంతో గత నాలుగు రోజులుగా ఇబ్బంది పడిన ఏలూరు నగర ప్రజలకు కార్పొరేషన్ ఉపశమనం కల్పించింది. నేటి (మంగ‌ళ‌వారం) నుంచి నగరానికి రోజుకు రెండు పూటలా తాగునీటి సరఫరా పునరుద్ధరించినట్లు కార్పొరేషన్ కమిషనర్ ఎ.భానుప్రకాష్ తెలిపారు.
ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనెల 22వ తేదీ నుంచి నాలుగు రోజులు పాటు స్టోరేజ్ ట్యాంక్ లో నీటి నిల్వలు తగ్గిపోవడంతో నగరానికి రోజుకి ఒక పూట మాత్రమే తాగునీటిని సరఫరా చేశామ‌ని వివరించారు.

ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, మేయర్ నూర్జహాన్ ఆదేశాల మేరకు గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు, వరద నీటితో స్టోరేజ్ ట్యాంక్ లో నిల్వలు పెరిగాయని తెలిపారు. పరిస్థితిని సమీక్షించిన అనంతరం నేటి నుంచి నగర ప్రజలకు పూర్తి స్థాయిలో మంచినీటి సరఫరా చేయాలని నిర్ణయించాం. ఇకపై ఉదయం, సాయంత్రం రెండు పూటలా యథావిధిగా నీరు వస్తుందని భానుప్రకాష్ స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నీటిని వృథా చేయకుండా అవసరానికి మాత్రమే వినియోగించుకోవాలని కమిషనర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ప్రతి ఒక్కరూ బాధ్యతగా మెలిగితే వేసవిలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నీటిని అందించగలమ‌ని ఆయన అన్నారు. వరదలతో నిల్వలు పెరగడంతో ఏలూరు వాసులకు మళ్లీ రెండు పూటలా తాగునీటి భరోసా లభించింది.