మట్టి, ఇసుక మాఫియాలను మంత్రి తుమ్మల నడిపిస్తున్నారు

ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తా: మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం ఉమ్మడి బ్యూరో, ఆంధ్రప్రభ: గతంలో తప్పుడు ఆరోపణలు చేసిన వారే ప్రస్తుతం అరాచకాలకు పాల్పడుతున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఉద్దేశించి మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తనపై గతంలో అరాచకాలు, అక్రమాలకు సంబంధించిన తప్పుడు ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు అదే తరహా అరాచకాలు, మాఫియా కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో అనేక మట్టి గుట్టలను అక్రమంగా తవ్వి దోచుకుంటూ, ఇసుక, మట్టి మాఫియాలను ప్రోత్సహిస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై పువ్వాడ విమర్శలు చేశారు.

తన ఆరోగ్యంపై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేశారని, తనకు ఏదో జరిగిపోయినట్లుగా అసత్య వార్తలు ప్రచారం చేశారని ఆయన అన్నారు. అయితే తాను ఆరు అడుగుల కటౌట్‌లా నిటారుగా నిలబడి ఉన్నానని, ప్రజల కోసం పోరాడే స్ఫూర్తితో ఎప్పటికీ ప్రజల పక్షాన నిలిచి పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే చరమగీతం పాడతారని పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రజలతో కలిసి నిరంతరం పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.