AP | త్వరలోనే అమ్మవారికి 100 కేజీల బంగారంతో సంపూర్ణ స్వర్ణ వస్త్రం..

గ్రామ దేవతల ఆలయాల్లో స్వర్ణ వస్త్రం చరిత్ర
భక్తుల సమర్పించిన 23 కేజీల బంగారాన్ని స్వర్ణ వస్త్ర నిధి కమిటి సభ్యులకు అందజేసిన ఎమ్మెల్యే అంజిబాబు


భీమవరం బ్యూరో, ఆంధ్రప్రభ : విజయదశమికి భీమవరం మావుళ్ళమ్మ అమ్మవారికి సుమారు రూ.35 కోట్లు విలువ కలిగిన 23 కేజీల బంగారంతో స్వర్ణ ఆభరణాలు తయారీ చేయనున్నామని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. మావుళ్ళమ్మ అమ్మవారికి ఇప్పటి వరకు భక్తులు సమర్పించిన 23 కేజీల బంగారాన్ని సోమవారం ఎమ్మెల్యే అంజిబాబు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, దేవస్థానం సభ్యుల సమక్షంలో స్వర్ణ వస్త్ర నిధి కమిటి సభ్యులకు అందించారు.

ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. త్వరలోనే అమ్మవారికి 100 కేజీల బంగారంతో సంపూర్ణ స్వర్ణ వస్త్రాన్ని తయారు చేస్తామని, సుమారు రూ.150 కోట్ల విలువ కలిగిన బంగారంతో స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని, గ్రామ దేవతల ఆలయాల్లో స్వర్ణ వస్త్రం గొప్ప చరిత్ర అని అన్నారు. ఇప్పటి వరకు సుమారు 50 కేజీల బంగారు ఆభరణాలు అమ్మవారికి ఉన్నాయని, ప్రస్తుతం 23 కేజీల బంగారం పలు రకాల ఆభరణాలు తయారు చేయిస్తున్నామని, మరో 27 నుంచి 30 కేజీల బంగారం కావాల్సి ఉందన్నారు. దాతలు భక్తుల సహకారంతో 100 కేజీల బంగారంతో స్వర్ణ వస్త్రాన్ని పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు.

దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ డీఎల్ వి రమేష్ బాబు, జెఈవో పల్లంరాజు, అసిస్టెంట్ కమిషనర్ హరి సూర్య ప్రకాష్, ఆలయ ఈవో బుద్ధ మహాలక్ష్మి నగేష్ మాట్లాడుతూ… ఇప్పటి వరకు అమ్మవారికి 3 వేల మంది భక్తులు 13 కేజీల బంగారం, బిస్కెట్ రూపంలో కేజీ 378 గ్రాములు, కాయిన్స్ రూపంలో 5 కేజీల 323 గ్రాములు, హుండీల ద్వారా 980 గ్రాములు, 2 కేజీల 139 గ్రాముల బంగారం విరాళంగా అందించారన్నారు. మొత్తం 23 కేజీల 139 గ్రాముల బంగారం భక్తులు సమర్పించారని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్, పాలకవర్గ సభ్యులు, ఆయా దేవాలయాల ఈవోలు, సిబ్బంది పాల్గొన్నారు.