తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి

రైతులకు వ్యవసాయ శాఖ అధికారుల అవగాహన కార్యక్రమం

దండెపల్లి, ఆంధ్రప్రభ : తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని వ్యవసాయ శాఖ ఏడీఏ కృష్ణ రైతులకు సూచించారు.

సోమవారం దండెపల్లి మండలంలోని నంబాల, వెల్గనూర్ గ్రామాల్లో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత ఎల్‌నినో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వర్షపాతం అస్థిరంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు తక్కువ నీటితో అధిక దిగుబడినిచ్చే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.

వర్షాధార పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంపిక చేసుకోవడం ద్వారా నష్టాలను గణనీయంగా తగ్గించుకోవచ్చని తెలిపారు. అధిక నీటి అవసరం ఉండే వరి పంటకు బదులుగా కంది, పెసర, మినుము, జొన్న, సజ్జ, నువ్వులు, వేరుశెనగ వంటి ప్రాంతానుకూల పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.

రైతులు శాస్త్రీయ పద్ధతులను అనుసరిస్తూ మట్టి పరీక్షల ఆధారంగా ఎరువులను వినియోగించాలని, వర్షపు నీటి సంరక్షణ, తేమను కాపాడే వ్యవసాయ విధానాలు, సమతుల్య ఎరువుల వినియోగం, సమగ్ర చీడపీడల యాజమాన్యాన్ని పాటించాలని కోరారు.

వ్యవసాయ శాఖ సూచించిన ధ్రువీకరించిన విత్తనాలను మాత్రమే వినియోగించాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి అంజిత్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు శ్రావణ్, సాయి కృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు.