తెలంగాణలో స్కూళ్లకు సెలవులపై గందరగోళం

వర్షాలు.. వైరల్ పోస్టులు.. సెలవులపై క్లారిటీ ఇదే!

హైదరాబాద్, ఆంధ్రప్రభ : సోషల్ మీడియాలో నిన్నటి నుంచి విస్తృతంగా ప్రచారంలో ఉన్న “తెలంగాణలో భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించారు” అనే పోస్టులపై గందరగోళం నెలకొంది.

అయితే, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు ఒకేసారి సెలవు ప్రకటించినట్లు ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ చేయలేదు. రాష్ట్రస్థాయిలో సాధారణ సెలవు ప్రకటన వెలువడలేదని అధికారిక సమాచారం సూచిస్తోంది.

వాతావరణ శాఖ పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో, కొన్ని జిల్లాల్లో పరిస్థితులను బట్టి జిల్లా కలెక్టర్లు స్థానికంగా సెలవులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల తల్లిదండ్రులు, విద్యార్థులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందేశాలను నమ్మకుండా, ఆయా జిల్లా కలెక్టర్ కార్యాలయం లేదా పాఠశాల యాజమాన్యం నుంచి వచ్చే అధికారిక ప్రకటనలనే పరిగణనలోకి తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఇదే సమయంలో, భారీ వర్షాల నేపథ్యంలో “స్కూళ్లకు సెలవు” అంటూ పాత ఉత్తర్వులు, మార్ఫింగ్ చేసిన చిత్రాలు, నిర్ధారణ లేని సందేశాలు వాట్సాప్, ఫేస్‌బుక్, ఎక్స్ తదితర వేదికల్లో విస్తృతంగా షేర్ అవుతున్నాయి. అధికారిక ధృవీకరణ లేకుండా ఇలాంటి సందేశాలను ఫార్వర్డ్ చేయవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.