కోదండరామాలయంలో వైభవంగా శాకాంబరి అలంకరణ

గంపలగూడెం, ఆంధ్రప్రభ: మండలంలోని ఊటుకూరు శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా సోమవారం శాకాంబరి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని మల్లెపూలతో ప్రత్యేకంగా అలంకరించారు. రాజ్యలక్ష్మి, గోదా అమ్మవార్లను బెండ, దొండ, వంకాయ, చిక్కుడు, క్యారెట్, బీట్‌రూట్, సొరకాయ, గుమ్మడికాయ, కాప్సికం, ఆకుకూరలతో శాకాంబరి అలంకరణను వైభవంగా నిర్వహించారు. అదేవిధంగా ఆలయం వెలుపల సర్వాంగసుందరంగా దండలు తయారు చేసి అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు లక్ష్మీ శ్రీనివాస సూరి ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులను వేదమంత్రాలతో ఆశీర్వదించారు. మహిళలు పాల్గొని హరేరామ నామసంకీర్తన, విష్ణు, లలిత పారాయణం నిర్వహించారు. భక్తులు స్వామివారు, అమ్మవార్ల దర్శనం పొంది కదంబం ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ చైర్మన్ పద్మనాభుని సర్వేశ్వరరావు, సభ్యులు చెరుకూరి చిట్టెమ్మ, చావా శ్రీనివాసరావు, జక్కుల కృష్ణ, తమ్మిశెట్టి నాగరాజు, జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు, గుంతా కిషోర్, ముత్యాల నాగేంద్రరావు, జిక్కుల నరసింహారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు.