పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా.. రూ.50 వేల జరిమానా

శ్రీ సత్యసాయి, (ఆంధ్రప్రభ): పీడీఎస్ (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయిస్తున్న వ్యక్తిపై ధర్మవరం పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ ఆదేశాల మేరకు బైండ్ ఓవర్ నిబంధనలను ఉల్లంఘించినందుకు నిందితుడికి రూ.50 వేల జరిమానా విధించినట్లు ధర్మవరం వన్‌టౌన్ సీఐ రెడ్డప్ప తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం బత్తలపల్లి మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన, ప్రస్తుతం ధర్మవరంలోని వైఎస్సార్ కాలనీలో నివాసముంటున్న ధనుంజయ్ (33) రేషన్ దుకాణాల ద్వారా సబ్సిడీపై పంపిణీ చేసే పీడీఎస్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో గతంలో అతనిపై క్రైమ్ నెం.32/2026 కింద ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ సెక్షన్ 7(1) ప్రకారం కేసు నమోదు చేయగా, అనంతరం అదే చట్టం కింద క్రైమ్ నెం.119/2026 కూడా నమోదైంది. మొదటి కేసు అనంతరం ఎంఆర్ఓ సమక్షంలో ఎంసీ నెం.45/2026 ప్రకారం రూ.5 లక్షల బాండ్‌పై బైండ్ ఓవర్ చేశారు.

అయితే బైండ్ ఓవర్ అమల్లో ఉండగానే మళ్లీ అక్రమ కార్యకలాపాలకు పాల్పడినట్లు గుర్తించిన అధికారులు, బాండ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎంఆర్ఓ సమక్షంలో హాజరుపరిచి బాండ్‌లోని ఫోర్‌ఫీచర్ క్లాజ్ ప్రకారం రూ.50 వేల జరిమానా విధించారు. నిందితుడు ఆ మొత్తాన్ని ట్రెజరీలో చలాన్ ద్వారా జమ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ రెడ్డప్ప మాట్లాడుతూ, బైండ్ ఓవర్ చేసిన వ్యక్తులు మళ్లీ నేరాలకు పాల్పడితే జరిమానాలతో పాటు మరిన్ని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, రవాణా చేయడం, విక్రయించడం వంటి చర్యలపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు కూడా ఇటువంటి అక్రమాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.