Congress | ఇలా అయితే మళ్లీ గెలవలేం
కాంగ్రెస్ నేతలకు మీనాక్షి నటరాజన్ క్లాస్
సోషల్ మీడియా ప్రచారంలో దూకుడు పెంచాలని సూచన
Congress | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీ పరిస్థితి, అంతర్గత విభేదాలపై రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టి సారించారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో వరుస సమావేశాలు నిర్వహించిన ఆమె.. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. పార్టీలో చిన్నచిన్న అంశాలపై నేతలు బహిరంగంగా విభేదిస్తే ప్రజల్లో ప్రతికూల సంకేతాలు వెళ్తాయని, ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్ ఎన్నికల్లో ఇబ్బందులు ఎదురవుతాయని ఆమె హెచ్చరించినట్లు సమాచారం.
పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల్లో మరింత విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని మీనాక్షి నటరాజన్ సూచించినట్లు తెలుస్తోంది. ప్రచార విషయంలో పార్టీ వెనుకబడిందని, ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ప్రతిపక్షాల ప్రచారాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఎంపీలు, ఎమ్మెల్యేలకు సూచించినట్లు సమాచారం. బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రచారానికి దీటుగా కాంగ్రెస్ బలమైన వ్యూహంతో ముందుకు వెళ్లాలని ఆమె పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
నేతల మధ్య విభేదాలపై ఆరా
పార్టీలోని అంతర్గత సమస్యలు, స్థానిక నాయకుల మధ్య సమన్వయ లోపంపై మీనాక్షి నటరాజన్ ప్రత్యేకంగా ఆరా తీశారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలతో ఆమె వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సమావేశాల్లో నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితి, స్థానిక సమస్యలు, నేతల మధ్య సమన్వయ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.
కొండా సురేఖ-కడియం అంశంపై చర్చ
మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య నెలకొన్న విభేదాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దేవాదాయ శాఖ వ్యవహారాల్లో కడియం శ్రీహరి జోక్యం చేసుకుంటున్నారని కొండా సురేఖ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ అంశంలో సంయమనం పాటిస్తూ సమస్యను పరిష్కరించుకోవాలని మీనాక్షి నటరాజన్ సూచించినట్లు తెలుస్తోంది. కడియం శ్రీహరి కూడా తన వాదనను ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
తుంగతుర్తి వివాదంపై చర్చ
భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో జరిగిన భేటీలో తుంగతుర్తి నియోజకవర్గంలో నెలకొన్న పార్టీ పరిస్థితి, స్థానిక నాయకుల మధ్య సమన్వయం అంశాలపై చర్చించినట్లు సమాచారం. నామినేటెడ్ పోస్టుల అంశంపై పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ వేం నరేందర్ రెడ్డితోనూ మీనాక్షి నటరాజన్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
డీసీసీ అధ్యక్షులతో సమీక్ష
వచ్చే రెండు రోజుల పాటు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల పనితీరు, పార్టీ కార్యక్రమాల అమలుపై మీనాక్షి నటరాజన్ సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే ఎస్‌ఐఆర్ (SIR) ప్రక్రియ, ఓటరు జాబితా ఎన్యూమరేషన్ అంశాలను పార్టీ నేతలు సీరియస్‌గా తీసుకోవాలని ఆమె సూచించినట్లు సమాచారం.
