అయోధ్యకు మళ్లీ సిట్ !

  • ట్రస్ట్ సభ్యుల విచారణ..
  • తొలి సీఈఓ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

ఆంధ్రప్రభ, అయోధ్య : అయోధ్య శ్రీరామ మందిర విరాళాల దుర్వినియోగం ఆరోపణలపై దర్యాప్తు చేపడుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) మరోసారి అయోధ్యకు వెళ్లేందుకు సిద్ధమైంది. ఆర్థిక లావాదేవీలు, సంబంధిత పత్రాలు, భద్రతా లోపాలపై లోతుగా పరిశీలించడంతో పాటు… శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యులను కూడా ప్రశ్నించనున్నట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ఇదిలా ఉండగా, విరాళాల కేసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో రామమందిర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ దినసరి పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు మొట్టమొదటి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) నియామకానికి దరఖాస్తులను ఆహ్వానించింది.

జులై 6న జరిగిన ట్రస్ట్ సమావేశంలో మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) విష్ణుకాంత్ చతుర్వేది, మాజీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ చైర్మన్ సురేష్ హవారే సభ్యులుగా ముగ్గురు సభ్యులతో కూడిన ఎంపిక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ అభ్యర్థులను పరిశీలించి ముగ్గురు పేర్లను ట్రస్ట్‌కు సిఫారసు చేయనుంది. తుది ఎంపికను ట్రస్ట్ నిర్వహిస్తుంది.

సీఈఓ పదవికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 50 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉండాలి. కనీసం డిగ్రీ విద్యార్హతతో పాటు 20 సంవత్సరాలకు పైగా పరిపాలనా అనుభవం తప్పనిసరి. ఆలయాలు, హిందూ మత సంస్థలు, ధార్మిక లేదా సేవా సంస్థల నిర్వహణలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. రిటైర్డ్ సీనియర్ అధికారులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ నియామకం ప్రారంభంలో మూడు సంవత్సరాల కాలపరిమితితో ఉంటుంది. పనితీరు సంతృప్తికరంగా ఉంటే పదవీకాలాన్ని పొడిగించే అవకాశం ఉందని ట్రస్ట్ తెలిపింది. ఎంపికైన సీఈఓ అయోధ్యలోనే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వేతనం పరస్పర అంగీకారంతో నిర్ణయిస్తారు. దరఖాస్తుల స్వీకరణకు జులై 18 సాయంత్రం 4 గంటలు చివరి తేదీగా నిర్ణయించారు.

మరోవైపు, రామాలయ విరాళాల దుర్వినియోగంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తున్న వేళ, కేసులో నిందితులు ఇప్పటికే జైలులో ఉన్నారని, అయోధ్యలో భక్తుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేదని మాజీ రామ్ జన్మభూమి-బాబ్రీ మసీదు వ్యాజ్యదారుడు ఇక్బాల్ అన్సారీ వ్యాఖ్యానించారు.

ఇక ట్రస్ట్‌లో తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కృష్ణమోహన్ బృందం జులై 22న జరిగే ట్రస్ట్ సమావేశం అనంతరం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆ సమావేశంలో ట్రస్ట్ భవిష్యత్ కార్యాచరణపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.